జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఈడీ అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో ఊరట లభించింది. జెల్లా జగన్మోహన్ రెడ్డికి చెందిన కడప జిల్లాలోని 27 ఎకరాల భూమి, మణికొండ ల్యాంకో హిల్స్‌లోని ఫ్లాటును తాత్కాలిక జప్తు చేస్తూ ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను ట్రైబ్యునల్ కొట్టివేసింది. ఆస్తులను వెంటనే జెల్లా జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. భారతీ సిమెంట్స్‌కు గనుల లీజు కేటాయింపులో నిబంధనలు పాటించలేదని, ఆ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉందంటూ ఆయన ఆస్తులను గతంలో ఈడీ అటాచ్ చేసింది. జెల్లా జగన్మోహన్ రెడ్డి అప్పీల్‌పై విచారణ జరిపిన ట్రైబ్యునల్ ఈడీ దర్యాప్తు తీరును తప్పుపట్టింది.
జగన్మోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ నుంచి వేతనం మాత్రమే పొందారని.. దానికి తగినట్లుగా పనిచేశారని పేర్కొంది. అక్రమ సొమ్ముతో ఆయన ఆస్తులు కూడ బెట్టుకున్నట్లు ఆధారాలు సమర్పించలేదని ట్రైబ్యునల్ తెలిపింది. ఆస్తులు తాత్కాలిక జప్తు చేసిన తర్వాత నిర్ణీత కాలంలో అభియోగపత్రం దాఖలు చేయడంలో ఈడీ విఫలమైందని ట్రైబ్యునల్ తెలిపింది. కాబట్టి తాత్కాలిక జప్తు ఉత్తర్వులు రద్దు చేస్తున్నామని... ఆస్తులు తిరిగి జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయాలని స్పష్టం చేసింది
ఇండియా సిమెంట్స్ ఆస్తుల పెండింగ్
జగన్ అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ ఆస్తుల తాత్కాలిక జప్తు వ్యవహారంపై విచారణను ఈడీ అప్పీలేట్ ట్రైబ్యునల్ పెండింగ్‌లో ఉంచింది. ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్‌పై సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ తేలిన తర్వాతే తాము విచారణ చేపడతామని పేర్కొంది.
ఇదీ చూడండి : కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం