జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోని డంపింగ్ యార్డుల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీటిని అధికారులు గంపగుత్తగా చెత్త వేసే ప్రదేశాలుగా మాత్రమే చూస్తున్నారు. వ్యర్థాల పునర్వినియోగాన్ని విస్మరించారు. ఫలితంగా డంపింగ్ యార్డులు కాలుష్య కేంద్రాలుగా మారి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో దుష్పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన చెత్తను రీసైక్లింగ్ చేయడం పురపాలకశాఖ బాధ్యత. నిబంధనల ప్రకారం ఎక్కడికక్కడ తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంటుంది. యార్డులోకి వెళ్లేముందు ప్రతి వాహనాన్ని వే-బ్రిడ్జిపై నిలిపి బరువు సరిచూసుకోవాలి. తడిచెత్తను వర్మీకంపోస్టుకు తరలించి వానపాముల సాయంతో సేంద్రియ ఎరువులుగా మార్చాలి. పొడి చెత్తలోని గాజు, ప్లాస్టిక్ సీసాలు, సంచులు వేరుచేసి మట్టి, ఇసుకతో ఎరువులు తయారు చేయాలి. జిల్లాలో ఎక్కడా ఈ విధానం అమలుకావడంలేదు. డంపింగ్ యార్డుల్లో రీసైక్లింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
పాఠాలు నేర్వలేదు..
కడప నగర పరిధిలోని ఉక్కాయపల్లె డంపింగ్‌యార్డుకి గతంలో చెత్త తరలించేవారు. అక్కడ రీసైక్లింగ్ ప్రక్రియని పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కాలుష్య నియంత్రణలో భాగంగా ఎకో పార్కుగా తీర్చిదిద్దడానికి రూ.20 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. గత ఎనిమిదేళ్లుగా నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తను చింతకొమ్మదిన్నె మండలం కనుమలోపల్లి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూడా చెత్త నిర్వహణ విషయంలో తగిన చర్యలు తీసుకోవడంలేదు. చెత్త తరలింపునకు 50 వాహనాలుండగా కొన్ని మరమ్మతులకు చేరాయి. నగరం నుంచి తీసుకొచ్చేటప్పుడే తడి, పొడి చెత్తను వేరు చేయాల్సి ఉన్నా అమలు కావడంలేదు. ఇక్కడ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయకుండా నిప్పుపెడుతున్నారు. వే-బ్రిడ్జిని ఉపయోగించిన దాఖలాల్లేవు.
వ్యాధుల బారిన పడుతున్నాం..
మేం నివసించే ప్రాంతానికి సమీపంలో రెండు చెత్త నిల్వ కేంద్రాలున్నాయి. వాటిల్లో చెత్తకు అగ్గి పెడుతుండడంతో విపరీతమైన పొగ వస్తోంది. గాలికి రాజీవ్‌నగర్, గోపవరం గ్రామాలను పొగ చుట్టేస్తోంది. వీటి నుంచి విడుదలయ్యే పొగతో జ్వరాలు, దగ్గు, జలుబు, శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయి. ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. మా పొలాల్లోకి చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు చేరడంతో పంట పొగబారి సరైనా దిగుబడి రావట్లేదు. దీనిపై అధికారులకు అర్జీలిచ్చినా ప్రయోజనంలేదు.
- వెంకటసుబ్బయ్య, ప్రొద్దుటూరు
తప్పకుండా రీసైక్లింగ్ చేయాలి..
ప్రతి డంపింగ్ యార్డులో తప్పకుండా చెత్త రీసైక్లింగ్ నిర్వహించాలని ఆదేశించాం. ఇందుకోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. వ్యర్థాలకు నిప్పుపెట్టకూడదు. కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.
- నాగరాజు, ప్రాంతీయ సంచాలకుడు, పురపాలకశాఖ
అగ్ని ప్రమాదాలు జరిగేందుకు అవకాశం..
కొర్రపాడు రహదారిలో డంపింగ్ యార్డు పక్కనే విద్యుత్తు ఉప కేంద్రం ఉంది. చెత్తను నిత్యం తగలబెడుతుండడంతో మంటలు చెలరేగుతుంటాయి. నిప్పులొచ్చి నియంత్రికలపై పడితే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అక్కడ నుంచి వెలువడే పొగతో విద్యుత్తు ఉపకేంద్రం సిబ్బందికి ఊపిరి ఆడడంలేదు. అక్కడకి పందులు చేరి చెత్తను రోడ్డు మీదకు తీసుకు రావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు పురపాలక సంఘం అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు.
- కృష్ణయ్య, లైన్‌మెన్
తడి, పొడి... వేరు చేసే లక్ష్యం కొరవడి ![]() ప్రొద్దుటూరు పట్టణంలో సేకరించిన చెత్తను గోపవరం గ్రామపంచాయతీ పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొర్రపాడు రహదారిలో మూడు ఎకరాలు, ద్వారకానగర్ సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్‌యార్డులున్నాయి. వీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతన్నారు. వ్యర్థాల తరలింపునకు 25 వాహనాలు ఉన్నా ఇటీవల మూడు మూలకు చేరాయి. డంపింగ్‌యార్డులో తడి, పొడి చెత్తను వేరుచేసే సెగ్రిగేషన్ యంత్రాన్ని వినియోగించకపోవడంతో పందులకు ఆవాసంగా మారింది. ఇక్కడ వే-బ్రిడ్జి పనిచేయడం లేదు. గాలికి వర్మీకంపోస్టు భవనం పైకప్పు ఎగిరిపోయినా పట్టించుకున్నవారే లేరు. కుప్పలుగా పోగైన చెత్తకు నిప్పు పెట్టడంతో పొగలోని మిథైల్ విషవాయువుతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. |
మూలకు చేరిన యంత్రాలు ![]() పులివెందుల పురపాలక సంఘంలో కదిరి రహదారిలో సుమారు 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు నిర్వహణ సక్రమంగా జరగడంలేదు. నాలుగేళ్ల కిందట హర్ష ఎకో ప్రాజెక్టు లిమిటెడ్ కంపెనీకి చెత్త రీసైక్లింగ్‌కు గుత్త పనులు అప్పగించారు. గత నాలుగు నెలలుగా వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేసే యంత్రాలు మరమ్మతుల్లో ఉన్నాయి. వీటిని వినియోగంలోకి తెచ్చేందుకు గుత్తేదారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చెత్త పేరుకుపోతోంది. పురపాలక సంఘం కార్మికులు ఎక్కడపడితే అక్కడ చెత్తను వదిలేసి వెళ్తున్నారు. ఫలితంగా గాలులకు రహదారిపైకి పలు వ్యర్థాలు చేరుతుండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. నూతన యంత్రాల కొనుగోలుకు రూ.15 కోట్ల నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. |
నత్తనడకన పనులు ![]() జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని దిగువపట్నం కాలనీ చివర పెన్నానది ఒడ్డున డంపింగ్‌యార్డును ఏర్పాటు చేశారు. చెత్త రీసైక్లింగ్‌కు మూడు యంత్రాలు అందుబాటులో ఉన్నా పనులు నత్తనడకన జరుగుతున్నాయి. చుట్టుపక్కల దాదాపు 1,500 ఇళ్లు ఉన్నాయి. దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. గాలికి కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎగిరివచ్చి తమ ఇంటి పరిసరాల్లో పడుతున్నాయంటున్నారు. రెండురోజులకొకసారి బ్లీచింగ్ పౌడరు జల్లుతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. |
చెత్తకు నిప్పు... ఆరోగ్యానికి ముప్పు ![]() రాజంపేట పురపాలక సంఘంలో సేకరించిన చెత్తను రాయచోటికి వెళ్లే మార్గంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తను గుట్టలుగా పడేసి కాల్చేస్తున్నారు. తద్వారా వెలువడే పొగతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. యార్డులోని చెత్త గాలులకు తమ ఇళ్ల వద్దకు వస్తోందని స్థానికులు గతంలో ఆందోళనకు దిగారు. మైదుకూరు పురపాలక సంఘంలో ఎల్లంపల్లె సమీపంలో గగ్గితిప్ప వద్ద డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మట్టి తీయగా ఏర్పడిన గోతులను వినియోగిస్తున్నారు. గతంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి చెత్త రీసైక్లింగ్ ఏర్పాట్లకు అనువుగా లేదని నిర్ధారించారు. యార్డులోకి వాహనాలు వెళ్లడానికి అనువుగా లేదనే కారణంతో రహదారి పక్కనే చెత్తను పడేస్తున్నారు. దీనికితోడు యార్డుకు ప్రహరీ లేకపోవడంతో గాలులకు పొలాల్లోకి వ్యర్థాలు చేరుతున్నాయి. |
పరిశ్రమలకు తరలింపు ![]() ఎర్రగుంట్ల నగర పంచాయతీకి శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం సేకరించిన చెత్తను కడప రోడ్డులోని ఒక పరిశ్రమకు తరలిస్తున్నారు. ప్రధాన రహదారి సమీపంలో చెత్తను వేస్తుండడంతో అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు దుర్వాసనతో సతమతమవుతున్నారు. బద్వేలు పురపాలక సంఘంలో డంపింగ్ యార్డు కోసం 20 ఎకరాలు అవసరం కాగా.. పట్టణ శివారులో 10 ఎకరాలు మాత్రమే కేటాయించారు. చెత్త తరలింపునకు వాహనాల కొరత ఉంది. |
షెడ్లు వేశారంతే ![]() రాయచోటి పురపాలక సంఘంలో వరిగ రహదారిలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. పట్టణం వేగంగా విస్తరించడంతో గత పదేళ్లలో జనాభా 50 వేల నుంచి 1.10 లక్షలకు చేరింది. యార్డులో చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయడానికి షెడ్లు వేశారు. అవసరమైన యంత్రాలు లేకపోవడంతో చెత్త నిల్వలు కొండలను తలపిస్తున్నాయి. చెత్తకు నిప్పు పెట్టడంతో వచ్చే దుర్వాసనకు పట్టణ వాసులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ పచ్చదనం ఊసే కరవైంది. |

ఇదీ చూడండి: JAGANANNA COLONIES: జగనన్న కాలనీ నిర్మాణాల్లో ఇటుక, కంకరకే ధర ఖరారు!