కడప సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపేందుకు కృషి చేయాలని జిల్లా ఉపపాలనాధికారి ఐ.పృధ్వితేజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమ్న వర్గాల ప్రజలపై వివక్ష, అత్యాచారాలు నిరోధించేందుకు డివిజన్ స్థాయి మానిటరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి ఈ కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానులే అని సబ్‌కలెక్టర్ అన్నారు. సివిల్ రైట్స్ డేని తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో సివిల్ రైట్స్ డే జరపాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఎస్సీ ,ఎస్టీలపై అత్యాచారాలు జరిగినప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీస్‌శాఖకు సూచించారు. అలాంటి కేసులలో బాధితులకు పరిహారం అందించేందుకు సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారికి సంబంధించిన భూసమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: త్వరలోనే కడప ఉక్కు కర్మాగారానికి పర్యావరణ అనుమతులు