Digitization Palmistry Texts at CP Brown Language Research Center : తెలుగు భాష, సాహిత్యాన్ని కాపాడేందుకు సీపీ బ్రౌన్ ఎంతగానో కృషి చేశారు. ఆయన 1820లో కడప కలెక్టర్కు సహాయకుడుగా పనిచేసే కాలంలోనే తెలుగు భాష అభివృద్ధి కోసం పాటుపడ్డారు. దాదాపు 70కి పైగానే గ్రంథాలను పరిష్కరించేందుకు తన జీతాన్ని, జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి సీపీ బ్రౌన్. ఆయన మరణానంతరం ఆయన పేరుతోనే కడపలో ఏర్పాటైన సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఇప్పటివరకు 70 వేల వరకు తెలుగుతో పాటు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇదే గ్రంథాలయం రెండో అంతస్తులో ప్రాచీన కవులు రచించిన తాళపత్ర గ్రంథాలను కూడా భద్రపరిచారు.
Digitization Palmistry Texts in Kadapa : కాగితం అందుబాటులో లేని కాలంలో కవుల రచనలన్నీ తాళపత్ర గ్రంథాలపైనే సంస్కృతంలో రచించేవారు. అలాంటి అరుదైన వారసత్వ సంపద అంతరించి పోకుండా కాపాడేందుకు సీపీ బ్రౌన్(CP Brown) భాషా పరిశోధన కేంద్రం తాళపత్ర గ్రంథాలను సేకరించి, వాటిని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేపట్టింది. ఈ పరిశోధన కేంద్రంలో దాదాపు 200 వరకు తాళపత్ర గ్రంథాలను భద్రపరిచారు. రామాయణం, మహాభారతం, భాగవతంతో పాటు ఎన్నో చారిత్రక గ్రంథాలను ఇక్కడ భద్రపరిచారు. వాటన్నిటినీ డిజిటలైజేషన్ చేస్తున్నారు. వెలుగులోకి రాని అనేక గ్రంథాలను కూడా ఇక్కడ పరిష్కరిస్తున్నారు. ఇక్కడ వెయ్యి సంవత్సరాల కాలం నాటి అరుదైన తామ్ర పత్రం కూడా అందుబాటులో ఉంది. కవులు రాసేందుకు వాడే ఘంటాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత కాలంలో అందుబాటులోకి వచ్చిన చేతితో రాసిన రాత ప్రతుల గ్రంథాలను 20 వరకు సేకరించి భద్రపరిచారు.
భావితరాల కోసం విలువైన గ్రంధాలు డిజిటలైజేషన్
ఇక్కడ ఇంకా వేదాలు, పురాణాలతో పాటు శ్రీకృష్ణదేవరాయుల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ప్రముఖుడైన అల్లసానిపెద్దన రచించిన అనేక గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ఆయన రాసిన మను చరిత్ర అనే ప్రభంద కావ్యంతోపాటు రామానుజ భూషణుడు రచించిన గ్రంథాలు భట్టుపల్లి, వసుచరిత్ర ఇక్కడ అందుబాటులో ఉంది. భరతుడు నాట్యశాస్త్రం, సోమనాథుడు రచించిన నాట్యచూడామణి, మొల్ల రామాయం వంటి కావ్యాలు తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమయ్యాయి. ఐదు వరకు ఆయుర్వేద గ్రంథాలు, పోతురాజు మల్లన రాసిన బ్రహ్మోత్తర ఖండం కూడ ఇక్కడ ఉంది.
వీటిలో దాదాపు 90 శాతం వరకు గ్రంథాలను సీపీ బ్రౌన్ బాషా పరిశోధకులు వెలుగులోకి తీసుకొచ్చారు. వెలుగులోకి రాని ఇంకా గ్రంథాలను ప్రపంచానికి పరిచయం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వాటిలో కల్నల్ మెకంజీ రాసిన కైఫీయత్తులు ముఖ్యమైనవి. తాళపత్రాల్లో దాగివున్న 7 మెకంజీ కైఫీయత్తుల గ్రంథాలను వెలుగులోకి తెచ్చిన పరిశోధకులు, ఇంకా రెండు గ్రంథాలను పరిష్కరించే పనిలో ఉన్నారు. ఇది పూర్తయితే కడప జిల్లా చరిత్ర సమగ్ర స్వరూపం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సీపీ బ్రౌన్ బాషా పరిశోధకులు చెబుతున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన తాళపత్ర గ్రంథాల(Palmistry texts)ను ముందుగా శుద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాళపత్ర గ్రంథాలపై ఉన్న దుమ్ము, ధూళిని అతి జాగ్రత్తగా శుభ్రం చేయడంతో పాటు అక్షరాలు చెరిగిపోకుండా, పత్రం చిరిగిపోకుండా నిమ్మగడ్డి నూనెతో శుభ్రం చేస్తారు. తాళపత్ర గ్రంథాలను నేటి తరం కూడా చూసే విధంగా క్రిమి కీటకాలు దరిచేరని పసుపు లేదా ఎర్రటి వస్త్రంలో భద్ర పరుస్తామని పరిశోధకులు చెబుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పరిశోధకలు భాషా అంటున్నారు.
సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం: డిప్యూటీ సీఎం