కడప శివారులోని ఊటుకూరు వద్ద ఏర్పాటు చేసిన పెరటికోళ్ల ఉత్పత్తి కేంద్రం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఏటా 2 లక్షల కోడి పిల్లల ఉత్పత్తి లక్ష్యంతో రూ.90 లక్షలతో మంజూరైన ఈ కేంద్రానికి 2008, మే 22వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగింది. అయితే కోడిపిల్లల ఉత్పత్తిని 2013, డిసెంబరు 10వ తేదీన అధికారికంగా ప్రారంభించారు. 2013 నుంచి 2017 వరకు నాలుగేళ్లలో 88,388 గుడ్ల ద్వారా 70,404 కోడి పిల్లలను ఉత్పత్తి చేశారు. ఏటా రూ.15 లక్షల నిర్వహణ నిధులతో నడుస్తున్న కేంద్రంలో సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో ప్రారంభించిన నాలుగేళ్లకే మూతపడింది.
దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. 2018-19 నుంచి ఎస్సీఎస్పీ (ఎస్సీ సబ్ ప్లాన్), ఎన్‌ఎస్పీ (నార్మల్ సబ్ ప్లాన్) కింద కోడిపిల్లలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. రెండు పథకాల కింద వెయ్యి యూనిట్ల కోడిపిల్లలను ఏటా సరఫరా చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌లో 45 కోడి పిల్లలు ఉంటాయి. ఒకేసారి 45 పిల్లలను సరఫరా చేయకుండా 25 పిల్లలను ఒకసారి, రెండు నెలల తరువాత మరో 20 పిల్లలను పంపిణీ చేస్తున్నారు. అయితే 2019 సంవత్సరానికి సంబంధించి రెండో విడత ఇవ్వాల్సిన 20 పిల్లలను ఇంతవరకు సరఫరా చేయలేదు. కేంద్రం మూతపడడంతో భవనాల చుట్టూ ముళ్లకంపలు పెరిగిపోయి అధ్వాన్నంగా తయారైంది. ప్రస్తుతం ఇక్కడ పశుసంవర్ధకశాఖ ఏడీ రమణయ్య, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఈశ్వరప్రసాద్ విధులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం...
కేంద్రాన్ని నడపాలంటే పూర్తిస్థాయిలో సిబ్బంది అవసరం. సాంకేతిక నిపుణులు, హ్యాచరీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సిబ్బంది కొరతతోపాటు సమస్యలపై ప్రభుత్వానికి నివేదించాం. - ఈశ్వరప్రసాద్, వెటర్నిటీ అసిస్టెంట్ సర్జన్, కడప
ఇదీ చదవండి: దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌కు గుండెపోటు!