FLOODS EFFECT IN KADAPA: కడప జిల్లాలో అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగిపోవటంతో ఒక్కసారిగా ముంచెత్తిన వరద చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతంలోని గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది. పచ్చని పంటపొలాల్ని, తోటల్ని మొత్తం ఇసుక దిబ్బలుగా మార్చేసింది. వరద ప్రభావిత గ్రామాల్లోని పంట పొలాల్లో నాలుగు అడుగుల ఎత్తున ఇసుక పేరుకుపోయింది. ఎగువ మందపల్లి, దిగువ మందపల్లిల్లో కనీసం 200 ఎకరాల్లో, పులపుత్తూరు, రామచంద్రాపురం, తోగూరుపేటల్లో చెరో వందేసి ఎకరాల్లో ఇసుక దిబ్బలు వచ్చేశాయి. ఆయా గ్రామాల్లో రైతులు ఏటా రెండు, మూడు పంటలు సాగుచేసుకునేవారు. ఆ ఆదాయమే జీవనాధారంగా ఉండేది. వరద బీభత్సానికి వారి పొలాలు కనుమరుగైపోయాయి. వాటిని తిరిగి సాగులోకి తేగలమా? అందుకు ఎన్నేళ్లు పడుతుంది? అప్పటివరకూ బతికెదేలా? అనే ఆందోళన, ఆవేదన అన్నదాతల్లో కనిపిస్తోంది. పులపుత్తూరుకు చెందిన సుబ్బరాజు, ఎగువ మందపల్లి వాసులు కె.సురేష్, కొండా ఆదిలక్ష్మీ, తోట సుబ్బారాయుడు, తోగూంపేటకు చెందిన జొన్నా నారాయణరావు తదితర రైతులు వరద నష్టంపై కన్నీటిపర్యంతమయ్యారు.
రైతుల డిమాండ్లలో కొన్ని
- ‘‘ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన ఇసుక మేటలు తొలగించి వచ్చే సీజన్ కల్లా పొలాల్ని సాగుకు సిద్ధం చేయాలి’’.
- ‘‘పొలాలను సాగుకు అనువుగా మార్చిన తర్వాత ఆయా పొలాల్లో బోర్లను ఉచితంగా వేయాలి. మోటార్లు, పైపులు వంటివన్నీ ఉచితంగా అందించాలి. సాగుకు పెట్టుబడికి నగదు సాయం అందించాలి’’.
మచ్చుకైనా కానరాని పొలాలు...
ఇదేదో తీర ప్రాంతం అనుకుంటున్నారా? కానేకాదు.. నిన్నమొన్నటి వరకూ పైరుతో కళకళలాడిన ప్రదేశం.. కానీ ఒకే ఒక్క కాళరాత్రిలో ముంచెత్తిన వరద.... ఆ పచ్చని పంట పొలాల్ని ఇసుక దిబ్బగా, ఎడారి కుప్పగా మార్చేసింది. రాజంపేట మండలం ఎగువ మందపల్లిలో వందల ఎకరాలను పూర్తిగా మింగేసింది.
వందల వ్యవసాయ బోర్లకు నష్టం...
వరద ప్రభావిత గ్రామాల్లోని పొలాల్లో దాదాపు వందలాది వ్యవసాయ బోర్లు ఇసుక దిబ్బల్లో కూరుకుపోయాయి. వీటి ఏర్పాటుకు ఒక్కో రైతు రూ.1 లక్ష నుంచి రూ.1.30 లక్షల వరకూ వెచ్చించారు. కొందరైతే అప్పులు చేసి మరీ బోర్లు తవ్వించారు. అవీ ఇంకా తీరనలేదు. వరద వల్ల మొత్తం బోర్లన్నీ ఇసుకలో పూడుకుపోయాయి. ఎగువ మందపల్లి, తోగూరుపేట, రామచంద్రాపురం, పులపుత్తూరు, గుండ్లూరు తదితర గ్రామాల్లో మొత్తంగా 700-800 బోర్లు ఇసుకలో పూడుకుపోయాయని రైతులు చెబుతున్నారు. తోగూరుపేట, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో మామిడి, అరటి, జామ తదితర తోటలు పూర్తిగా కనుమరుగైపోయాయి.
చెలమ కింద వరి చేను
చుట్టూ ఇసుక.. మధ్యలో ఉన్న ఓ చెలమలో నీటిని చూపిస్తున్న ఈయన పేరు షేక్ మహమ్మద్ అలీ. గుండ్లూరు వాసి. అయితే ఆయన చూపిస్తున్నది చెలమ కాదు. నిన్నమొన్నటి వరకూ అక్కడ వరిపొలం ఉండేది. ఇది వరద బీభత్సానికి నిదర్శనం. ‘‘వరద రాక ముందు మా పొలం ఉన్న చోట ఇప్పుడు నాలుగు అడుగుల లోతులో తవ్వి చూసినా ఇసుక, నీళ్లే వస్తున్నాయి. బాగు చేసి మళ్లీ సాగులోకి తేవాలంటే మా ఒక్కరి వల్ల సాధ్యం కాదు’’ అని అలీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: