ఐపీఎల్ ప్రారంభం కావడంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు కేంద్రంగా క్రికెట్ బుకీలు బెట్టింగ్ దందాను కొనసాగిస్తున్నారు. ఇదంతా పోలీస్ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరులో ప్రధానంగా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ జరుగుతోంది. ప్రొద్దుటూరు మండలం ఖాదర్ బాద్‌కు చెందిన బెట్టింగ్ డాన్ హైదరాబాద్ నుంచి తన అనుచరుల ద్వారా బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాలుగా బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. మరికొందరు ప్రొద్దుటూరులోనే ఉంటూ పందెలు జరుపుతున్నారు.
రాజీకీయ నాయకుల అండతోనే...
శుక్ర, శనివారాల్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి పొద్దుటూరులో సుమారు రూ.ఐదు కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ ముగిసేనాటికి వంద కోట్ల టర్నోవర్ ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే గతంలో పోలీసుల భయంతో క్రికెట్ బుకీలు పొరుగు రాష్ట్రాల్లో స్థావరాలు ఏర్పాటు చేసి బెట్టింగ్ నిర్వహించేవారు. ప్రస్తుతం రాజకీయ నాయకుల అండతో ఏ మాత్రం భయపడకుండా ప్రొద్దుటూరులోనే ఉంటూ పందేలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే క్రికెట్ బుకీలపై నిఘా ఉంచామని.. వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని బుకీలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఎర్రచందనం స్మగ్లింగ్: అక్రమ రవాణాకు అటవీ సిబ్బంది సాయం