CPI Raja On Flood Victims: కడప జిల్లా రాజంపేటలో అన్నమయ్య జలాశయం వల్ల దెబ్బతిన్న పులపుత్తూరు గ్రామాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సందర్శించారు. తెగిన జలాశయ కట్టను పరిశీలించి.. బాధితులతో మాట్లాడారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డి.రాజా డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన బాధితులకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అరకొర పరిహారంతో బాధితులకు న్యాయం జరగదన్నారు. రాష్ట్రంలో ఇంతటి ఘోర విపత్తు జరిగితే కేంద్రం నుంచి ఒక్క మంత్రి కూడా రాకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జలాశయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
అన్నమయ్య జలాశయ బాధితులకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని డి. రాజా స్పష్టం చేశారు. ఈ ఘోర విపత్తును కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఈశ్వరయ్య, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
ఊహకందని విపత్తు..
కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నవంబరు 16, 17, 18 తేదీల్లో కుండపోత వర్షాలు కురిశాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడ్డాయి. భారీ వరద ముంచెత్తడం, ప్రకృతి విపత్తు వల్ల అన్నమయ్య, ఫించ జలాశయాల కట్టలు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో పలు గ్రామాలకు చెందిన వారు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవించి.. బాధిత గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఘటనపై పెను దుమారం..
అన్నమయ్య, పింఛ జలాశయాల వరద కట్టలు తెగిపోయి పెను విధ్వంసం జరిగిన ఘటనపై ఇంటా బయటా పెనుదుమారం రేగింది. ఈ విషయంలో యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోగా.. ప్రాణనష్టమూ సంభవించింది. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నది అధికారవర్గాల వాదన.
కానీ, జలవనరుల రంగంలో ఉన్న నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సామర్థ్యానికి మించిన వరదతోనే డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే ఈ పెను ప్రమాదానికి కారణమని వారు అంటున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వరదల సమయంలో చూపించాల్సిన అప్రమత్తత విషయంలో అలక్ష్యం కూడా ప్రధాన కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదీ చదవండి
Missing: అన్నమయ్య జలాశయానికి పెరిగిన ఉధృతి...40 మంది గల్లంతు!