CPI RAMA KRISHNA COMMENTS ON CM JAGAN : సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన సందర్భంగా గుర్తించిన పలు అంశాలను రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట ప్రాంతాన్ని సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కుందూ నదిపై రాజోలి ఆనకట్ట నిర్మాణం కేవలం శంకుస్థాపనలకే పరిమితమైందని ఆరోపించారు.
జాతీయ ప్రాజెక్టు పోలవరంకు నిధులు ఇవ్వకుండా, రాయలసీమ రైతుల భవిష్యత్తుకు ఆటంకం కలిగించేలా ఉన్న ఎగువ భద్రను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రూ.5300 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడాన్ని రామకృష్ణ ప్రశ్నించారు. కరవు సీమ రాయలసీమ పట్ల రాష్ట్ర వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై సేకరించే సమాచారంతో నివేదిక తయారు చేసి విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమానికి రూపకల్పన చేస్తామని హెచ్చరించారు.
"స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా కేసీ కెనాల్ కష్టాలు తీరలేదు. కేసీ కెనాల్ ఆయకట్టుదారులు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సీఎం జగన్‌కు శంకుస్థాపనల మీద ఉన్న మోజు.. దానిని పూర్తి చేసే వాటి మీద లేదు. ఇక్కడ పనులేమి జరగడం లేదు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అంశాలను సేకరిస్తున్నాం. ఈ పర్యటనలు మొత్తం అయ్యాక ఒక నివేదిక తయారు చేసి.. రాష్ట్రంలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం"-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
మాజీ మంత్రి వివేకా హత్య కేసు నుంచి రాజధాని అంశం వరకు సీఎం జగన్‌ది కుట్రపూరిత ధోరణి అని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. మూడు ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టి లబ్ధి పొందాలనుకోవడం సమంజసం కాదని సూచించారు. అమరావతి రాజధానిపై వైసీపీ నిర్ణయాన్ని బయటపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కి రామకృష్ణ తన అభినందనలు తెలిపారు. రాజధానిపై జగన్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖ ఒక్కటే రాజధాని అంటే ప్రజలు అంగీకరించరనే.. మూడు రాజధానుల అంశం తీసుకొచ్చారని విమర్శించారు. రాజధానులు అంశంతో జనాలను మచ్చిక చేసుకుని లాభం పొందాలనుకుంటున్నారని ఆక్షేపించారు. రాజధాని అంశంపై రిఫరెండం పెట్టి ఎన్నికలకు వెళ్లగలరా అని ప్రశ్నించిన రామకృష్ణ.. గెలిచిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: