రాయచోటి పట్టణ పరిధిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలకు ఎదురుగా ఉన్న స్థలంలోనే పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేసింది. పేదలకు న్యాయం చేయాలని రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాయచోటి చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలను పెద్దలు ఆక్రమిస్తున్నా..రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 1997 లో పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చారన్నారు. మాసాపేట పొలం సర్వేనెంబర్ 237/1 తోపాటు మిగిలిన నెంబర్ లలో పట్టాలు ఇచ్చినప్పటికీ.. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూకబ్జాదారులు విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను బినామి పేర్లతో స్వాహా చేస్తున్నారని విమర్శించారు.
14రోజులుగా గతంలో ఇచ్చిన ఇంటి పట్టాలు తిరిగి పేదలకే ఇవ్వాలని భూపోరాటాలు, ఆందోళనలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడేలేడని వాపోయారు. పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు, పోలీసులు బలవంతంగా ధ్వంసం చేయడం దారుణమన్నారు. పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చేవరకు పోరాడతామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ సుబ్రమణ్యంరెడ్డితో చర్చించారు. అర్హత కలిగిన పేద రైతులకు అక్కడే ఇంటి పట్టాలు ఇచ్చేలా చూస్తామని ఎమ్మార్వో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి: నాడు-నేడు : విద్యాలయాలకు సమకూరుతున్న వసతులు