లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు...ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలోనూ అంతే ఔదార్యం చూపుతున్నారు. కడప రిమ్స్‌లో ఏడునెలలకే పుట్టిన కవల శిశువులను... మౌలిక సదుపాయాలున్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు నిలిచేలా సాయపడ్డారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం అబ్బాపురానికి చెందిన రమాదేవి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా గర్భం దాల్చింది. రిమ్స్‌లో ఏడో నెలలోనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. రిమ్స్‌లో సరైన పరికరాలు లేవని, ఇక్కడే ఉంచితే శిశువులు బతకటం కష్టమని చెప్పటంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు... వెంటనే ఎస్పీ అన్బురాజ్‌కు ఫోన్ చేశారు. నగరంలో ఆసుపత్రులన్నీ మూసి ఉన్నాయని, ఏదైనా చేసి తమ పిల్లలను బతికించాలని కోరారు. ఎస్పీ వెంటనే డీఎస్పీ సూర్యనారాయణకు ఫోన్ చేశారు. మూసిఉన్న ప్రైవేటు ఆసుపత్రిని తెరిపించి, సిబ్బందికి సమాచారమిచ్చి.... తల్లీబిడ్డలను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
ఇదీచదవండి