కడప నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కమిషనర్ లవన్న తెలిపారు. ఇప్పటికే నగరంలో 140కి పైగానే అక్రమ లే అవుట్లను గుర్తించామన్నారు. అనంతరం వాటి అనుమతులను రద్దు చేశామని స్పష్టం చేశారు.
తప్పనిసరిగా 30 అడుగుల వెడల్పు..
ప్రభుత్వం నుంచి విడుదలైన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మాణాలు చేసే సమయంలో తప్పనసరిగా 30 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండే విధంగా యజమానులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కోరారు. గతంలో కేవలం 15 అడుగులు మాత్రమే ఉన్న రోడ్డును.. ప్రస్తుతం 30 అడుగులకు పెంచామన్నారు.
సుందర నగరంగా..
కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో ఇక నుంచి నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నట్లు ప్రణాళిక ఉద్యోగులు వారి పరిధిలోని కట్టడాలపై దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. నగరంలో ఎలాంటి అక్రమ కట్టడాలు నిర్మించినా ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
ఇవీ చూడండి : అమరావతికి ఏం కాదు.. అవి తప్పుడు ప్రచారాలు: రైతులు