కడప జిల్లా బద్వేలు శాసనసభ స్థానానికి ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. శాసనసభ్యుడు వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కొవిడ్‌తో వాయిదా పడిన ఎన్నికలను అక్టోబరులో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధను అభ్యర్థిగా వైకాపా మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అభ్యర్థి రాజశేఖర్‌నే తిరిగి రంగంలో నిలుపుతున్నట్లు తెదేపా కొద్దివారాల క్రితం తెలిపింది. 2019 సాధారణ ఎన్నికల తరువాత రాష్ట్రంలో శాసనసభకు ఉపఎన్నిక జరగటం ఇదే తొలిసారి. తిరుపతి లోక్‌సభ స్థానానికే ఉపఎన్నిక జరిగింది. కిందటి సాధారణ ఎన్నికల్లో వైకాపా 44,734 ఓట్ల ఆధిక్యంతో తెదేపాపై గెలుపొందింది.
ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్లు తెదేపా ప్రకటించినా, కొన్నిచోట్ల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బద్వేలు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గోపవరం ఎంపీపీ, జడ్పీటీసీలను తెదేపా గెలుచుకుంది. ఉప ఎన్నికల ముందు ఇలాంటి ఫలితం రావటం ఆ పార్టీశ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఉప ఎన్నిక కోసం అధికార వైకాపా కొంతకాలంగా కసరత్తు మొదలుపెట్టింది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కొన్ని పనులు మంజూరుచేసింది. బద్వేలు కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. బద్వేలు పట్టణ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.130 కోట్లు, నియోజకవర్గంలో సాగునీటి పనులకు రూ.115 కోట్లు కేటాయించింది. రిజర్వుడు నియోజకవర్గం కావటంతో రెండు పార్టీల్లోనూ ఇతర నాయకులే ఇక్కడ కీలకంగా వ్యవహరించనున్నారు.

ఇదీ చూడండి: Badwel bypoll 2021: బద్వేల్ ఉపఎన్నిక.. తెదేపా అభ్యర్థి ఖరారు..వైకాపా నుంచి ఎవరంటే..!