ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు చట్టపరంగా న్యాయం చేస్తామని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. జిల్లాలోని జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారంపై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉక్కు పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ షన్మోహన్లతోపాటు సంబంధిత రైతులు పాల్గొన్నారు. నిర్వాసితులకు భూసేకరణ చట్టం మేరకు న్యాయబద్ధమైన నష్టపరిహారం అందేలా చర్యలు చేపడుతామన్నారు. రైతులు భూములకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను సమర్పిస్తే.. వారికి త్వరితగతిన పరిహారం అందిస్తామన్నారు.
పరిహారం పెంచాలి: రైతులు
ప్రభుత్వం నిర్ణయించిన విలువ కంటే ఎక్కువ ధరను ఇవ్వాలని కలెక్టర్కు రైతులు విన్నవించారు. రైతుల అభిప్రాయాల మేరకు నష్ట పరిహారం చెల్లింపునకు తగు చర్యలు తీసుకోవాలని జమ్మలమడుగు ఆర్డివో, సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిహారం విషయంలో చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ హరికిరణ్ రైతులకు తెలిపారు.
3వేల ఎకారాల భూసేకరణ
జమ్మలమడుగులోని సున్నపు రాళ్లపల్లె ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుకర్మాగారాన్ని నిర్మించేందుకు 3000 ఎకరాల భూసేకరణ చేపట్టిందన్నారు. అందులో పరిసర గ్రామాలకు చెందిన 193 మంది రైతులకు చెందిన 409 ఎకరాల భూమిని ఉక్కు కర్మాగారం నిర్మాణ అవసరాల మేరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. వారిలో ఎక్కువగా 115 మంది ఎస్సీ వర్గానికి చెందిన రైతులు ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పరిహారం అందిస్తామన్నారు.
ఇదీ చూడండి: తిరుపతి ఉపఎన్నిక: 30 నామినేషన్లు ఖరారు