AP Coastal area under erosion: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం కోతకు గురవుతోందని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. 3.5 కిలోమీటర్ల మేర విశాఖ వద్ద తీరం కోతకు గురి కాగా... 29 శాతం మేర రాష్ట్ర తీరప్రాంతమంతా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు కేంద్ర భూ భౌతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ వివరాలు బయటపెట్టింది. ఈ విషయాలు అన్ని ఇటీవల భారత తీర ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో వెలుగు చూసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
విశాఖ తీరంలో 3.5 కిలోమీటర్ల మేర కోత..: విశాఖ విశాఖపట్నానికి ఆనుకుని ఉన్న 15.42 కిలోమీటర్ల పొడవైన తీరం ఇప్పటివరకు 3.5 కిలోమీటర్ల తీరాన్ని కోల్పోయిందని కేంద్రం ఇచ్చిన సమాధానంలో వివరించింది. రాజ్యసభలో బిజెపి సభ్యుడు జివిఎల్ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ భౌతిక శాఖల మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్-ఎన్‌సిసిఆర్ అధ్యయనం ఆధారంగా తీరప్రాంత కోత గురించి కొన్ని వాస్తవాలను కేంద్రం ఈ సందర్భంగా బయటపెట్టింది.
28.7 శాతం భూభాగం కోత లోనైన ఏపీ తీర ప్రాంతం..: ఆంధ్రప్రదేశ్‌కి సుమారు 970 కిలోమీటర్ల ఉన్న తీర ప్రాంతంలో 28.7 శాతం భూభాగం వివిధ స్థాయిల్లో కోతకు గురైందని... దీనిలో అత్యధికంగా తూర్పుగోదావరి 89.25 కిలోమీటర్లు, కృష్ణా 57.55 కిలోమీటర్లు, నెల్లూరు 53.32 కిలోమీటర్లు, విశాఖపట్నం 25.81 కిలోమీటర్లు, శ్రీకాకుళం 25.12 కిలోమీటర్ల మేర తీరం కోతకు గురయినట్లు సర్వేలో వెల్లడైందని మంత్రి సమాధానంలో వివరించారు. ఉష్ణమండల తుఫానులు, రుతుపవనాలు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల, విపరీత సంఘటనలు మొదలైన సహజ కారణాలతోపాటు... ఓడరేవులు, నౌకాశ్రయాలు, నదులు దెబ్బతినడం వంటివి కూడా తీరప్రాంత కోతకు కారణమని తెలిపారు. తీరం కోత వల్ల.... భూమి, ఆవాసాలు, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినడంతోపాటు... ఫిషింగ్ కార్యకలాపాలకు అవసరమైన స్థలం కోల్పోవడం వంటి నష్టాలను చవిచూడాల్సి వస్తోందని మంత్రి వివరించారు. గత మూడు దశాబ్దాలుగా వైజాగ్ తీరం కోతను ఎదుర్కొంటోందని... ప్రతికూల పరిస్థితుల కారణంగా 3.5 కిలోమీటర్ల పర్యాటక బీచ్, తీర ప్రాంత రహదారులు కోల్పోయినట్లు కేంద్రం సమాధానంలో తెలిపింది.
ఏపీకి విస్తారమైన సముద్ర తీర ప్రాంతం..: ఏపీకి విస్తారమైన సముద్ర తీర ప్రాంతం ఉండటం ఒక పక్క అదృష్టంగా భావించాలి... కానీ అదే తీర ప్రాంతం కోతకు లోనవడం శాపంగా మారింది. ఏ దేశానికైనా రాష్ట్రానికైనా ఎంత తీర ప్రాంతం ఉంటే అంత వాణిజ్య, పారిశ్రామిక ప్రయోజనాలు మిళితమై ఆర్థిక లాభాలను, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచుతుంది.. ఏపీకి సహజ సిద్ధమైన వందల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. ఏపీ తీర ప్రాంతంలో పలు పోర్టుల నిర్మాణం ద్వారా భారీ స్థాయిలో సరుకులను, వస్తువులను, సముద్ర ఆధారిత మత్య ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతి చేయడానికి ఆస్కారముంది.. ఇప్పుడు అదే తీర ప్రాంతం కోతకు గురవుతోందని కేంద్ర ప్రభుత్వ ప్రకటనలతో ఆందోళన కలిగిస్తోంది. ఏపీ సముద్ర తీర ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న కోతల మూలంగా సమీప గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
కెరటాల ఉద్ధృతికి పశ్చిమ గోదావరి జిల్లా తీరం కోత...: కొన్నాళ్లుగా రోజు రోజుకు పెరుగుతున్న కోతతో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని సముద్ర తీర గ్రామాలు వణికిపోతున్నాయి. తుపాను సమయంలో కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉండటం అనంతరం యథాస్థితికి చేరుకోవడం ఆ గ్రామాల వాసులకు నిత్యకృత్యమే. అయితే గత కొన్ని నెలలుగా కెరటాల ఉద్ధృతికి తీరం కోతకు గురవుతోంది. తీరంలోని కొబ్బరి తదితర తోటలు నెమ్మది నెమ్మదిగా కడలి ఒడిలో కలిసిపోతుండటంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తీర గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. ఆహ్లాదకర వాతావరణంతో ఉండే ఈ తీర ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉంటుంది. గడిచిన యాభై ఏళ్ళుగా ఎన్ని తుపాన్లు వచ్చినా ఈ ప్రాంతం ప్రశాంతంగానే ఉంది. అందుకే పశ్చిమ తీర ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా పిలుస్తారు. అటువంటి ఈ ప్రాంతం తొలిసారి 2004లో సునామీ మృత్యుఘంటికలను చవిచూసింది. అప్పటి నుంచి తుపాన్లు వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రాంతం కోతకు గురవ్వడం ప్రారంభమయ్యింది.
ఇవీ చదవండి :