లింగాల మండలం పార్నపల్లె గ్రామ సమీపంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద పర్యాటక శాఖ చేపట్టిన నిర్మాణాలను సీఎం జగన్ ప్రారంభించారు. పాడా నిధులతో నిర్మించిన వైయస్‌ఆర్ లేక్‌వ్యూ రెస్టారెంట్, పార్కు, నాలుగు సీట్ల స్పీడ్ బోట్లు, 18 సీట్ల బోటింగ్ జెట్టీకి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. లేక్‌వ్యూ పార్కులో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పర్యాటకుల అతిథి గృహాలను ప్రారంభించిన అనంతరం లేక్‌వ్యూ పాయింట్ నుంచి రిజర్వాయరుతో పాటు ఆహ్లాదకరమైన పచ్చటి కొండల అందాలను తిలకించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రిజర్వాయరులో పడవ షికారు చేశారు. జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక శాఖ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
అనంతరం లింగాల మండల నేతలతో సీఎం భేటీ అయ్యారు. గ్రామ పంచాయతీల వారీగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరు నేరుగా ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చారు.లింగాల, పులివెందుల ప్రజల కోసం ఎంత చేసినా తక్కువేనని సీఎం అన్నారు. ‘మీ మమకారం ఎన్నటికీ మరవలేను’ అని వ్యాఖ్యానించిన సీఎం.....తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం అందరూ ఆదరించి మనోధైర్యం నింపడంతోనే ఈ రోజు ముఖ్యమంత్రిగా నిలబడ్డానని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ ఇదే అభిమానం చాటాలని విజ్ఞప్తి చేశారు. ఇడుపులపాయలో రాత్రి బస చేశారు. పులివెందులలో ఈ ఉదయం తన వ్యక్తిగత కార్యదర్శి కుమార్తె వివాహానికి హాజరై తిరుగు తాడేపల్లికి పయనం కానున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు, నేతలను కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు వద్ద దాదాపు అయిదు గంటలకుపైగా గడిపిన సీఎంను కలవడానికి వివిధ జిల్లాల నుంచి ప్రజలు తరలిరాగా ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కేవలం ఎంపిక చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను మాత్రమే అనుమతించారు. ప్రవేశ ద్వారం వద్ద జాబితాలో పేర్లున్న వారిని మాత్రమే అనుమతించారు. సొంత నియోజకవర్గానికి వచ్చినా... సీఎంను చూసే భాగ్యం లేకుండా పోయిందంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి చదవండి: