విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని... కడప జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు గురించి పట్టించుకోలేదన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... కడపలోని విద్యుత్ భవనం వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాన వేతనం ఇవ్వాలని కోరారు.
చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేంపల్లిలో పనిచేస్తున్న ఏడీ, 12 ఏళ్లుగా అక్కడే విధులు నిర్వర్తిస్తూ... కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వైకాపా నాయకులు, విద్యుత్ అధికారులు కుమ్మక్కై ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. విద్యుత్ కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను సమర్పించిన ఏపీ