కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం అధికారులంతా మనోధైర్యంతో ముందుకు సాగాలని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో రాయచోటి రెవెన్యూ కార్యాలయంలో మండల అధికారులతో కరోనా నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
2 నెలల నుంచి నియోజకవర్గ పరిధిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు రాకుండా వచ్చామనీ, ఇప్పుడు వచ్చిన పాజిటివ్ కేసుని సవాల్‌గా తీసుకొని ప్రజల్లో చైతన్యం నింపాలన్నారు. కరోనా వైరస్ నివారణ చర్యలను ముమ్మరంగా చేపట్టాలని సూచించారు.
కరోనా పాజిటివ్ వచ్చిన సంబేపల్లె మండలం ప్రకాష్ నగర్ కాలనీ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలోకి ఎవ్వరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రకాష్ నగర్లో ఎక్కువ మంది పేద దళితులే ఉన్నారనీ, వారందరికీ రేషన్, నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ మాస్కులు అందించాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చే వారి వివరాలను సేకరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో అన్ని మండలాలకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: లాక్ డౌన్ తర్వాత పలు మార్పులతో రోడ్లపైకి బస్సులు