రాష్ట్రంలో బలహీన వర్గాలు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి… సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు. కరోనా, లాక్ డౌన్ పస్థితులలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, చెప్పిన మాట ప్రకారం రెండో ఏడాది వాహనమిత్ర పథకం ద్వారా రూ.230 కోట్లను ఆటో కార్మికులు, మాక్సి క్యాబ్ దారులకు అందజేస్తున్నారన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు పేజీల మేనిఫెస్టోలోని హామీలను ఏడాది కాలంలోనే దాదాపుగా అన్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి దేశంలోనే జగనేనన్నారు. రూ 49 వేల కోట్లు సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా వేశామని వివరించారు. బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు.
ఆటోవాలాలు నిబంధనలను పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆటో కార్మికులకు అండగా… తోడుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆటో డ్రైవర్లు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.