దేశమంతా లాక్ డౌన్ అమలవుతున్న వేళ.. నిత్యావసరాలు తప్ప మరే ఇతర వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు లేకుండా పోయాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న చీనీ కాయల రైతులు.. అసలు అమ్మకాలే లేక లబోదిబోమంటున్నారు.
కడప జిల్లా జిల్లా వ్యాప్తంగా 19,842 హెక్టార్లలో చీనీ తోటలు సాగులో ఉన్నాయి. 2 నెలల క్రితం వరకూ టన్ను చీనీకాయల ధర రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పలికింది. వేసవి ఎండలు పెరుగుతున్న పరిస్థితిలో ధరలు మరింత పెరుగుతాయని ఆశలు పెట్టుకొన్న రైతులను కరోనా మహమ్మారి దెబ్బ తీసింది. కరవు పరిస్థితుల కారణంగా కొంతకాలంగా రెండో పంట రానే లేదు. ఈ ఏడాది కూడా వేసవిలో దిగుబడులు అరకొరగానే రాగా.. కనీసం పెట్టుబడులైనా వస్తాయనుకొన్న రైతులను కరోనా కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది.
ముందుకు రాని వ్యాపారులు
లాక్ డౌన్ కారణంగా వ్యాపారులు ముందుకు రాకపోవటంతో వేసవిలో కాసిన చీనీకాయలను కూడా అమ్ముకోలేని పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు బహిరంగ విపణిలో కిలో రూ.100తో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం వ్యాపారులు కొనేందుకు రావటం లేదు. పక్వానికి వచ్చిన కాయలు నేలపాలవుతున్నాయి. గతంలో నేల రాలిన కాయలను కూడా కొందరు చిరు వ్యాపారులు పండ్ల రసాల కోసం తీసుకెళ్లేవారు. ఇప్పుడు వారు కూడా ఇటువైపు చూడటమే లేదని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వాలంటీర్ల ద్వారా ప్రతి గ్రామంలో చీనీతోటలను జియో ట్యాగింగ్ చేయించి ప్రభుత్వమే కోనుగోలు చేయాలని లేదా వ్యాపారులైనా వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
సర్కారు ఆదుకోవాలి
పులివెందుల ప్రాంతంలో చీనీ తోటలు అధికంగా సాగులో ఉన్నాయని ఉద్యానశాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలోని రైతులకే అధిక నష్టం వాటిల్లుతోందన్నారు. కాయలను కొనుగోలు చేసే విషయాన్ని ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్తామని సుకుమార్ రెడ్డి తెలిపారు.
ఇది చదవండి: