మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 14వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ విచారణ జరుగుతోంది. నేడు వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ్ తుల్లా విచారణకు హాజరయ్యారు. వీరు ముగ్గురూ ఒకే కారులో పులివెందుల నుంచి కడపకు వచ్చారు. వీరు విచారణకు గదిలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే వివేకా కుమార్తె సునీత సీబీఐ విచారణకు హాజరయ్యారు. సునీతను సీబీఐ అధికారులు ప్రశ్నించడం ఇది మూడోరోజు. ఇవాళ సునీత సమక్షంలో ముగ్గురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కృష్ణారెడ్డే కీలకం...
గత ఏడాది మార్చి 15న ఉదయం 5.30 గంటలకు పీఏ కృష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు. కృష్ణారెడ్డి తలుపు తీసి చూస్తే వివేకా బాత్ రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించాడు. ఇతని ద్వారానే వివేకా చనిపోయారనే వార్త వారి కుటుంబ సభ్యులకు చేరవేశారు. ఇతనికే వివేకా బెడ్ రూంలో లేఖ కూడా దొరికింది. కానీ ఆ లేఖను సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వలేదు. సాయంత్రం వివేకా కుమార్తె సునీత సమక్షంలో లేఖను కృష్ణారెడ్డి పోలీసులకు అప్పగించారు. గతంలో కృష్ణారెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయగా...,ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. వివేకా ఇంట్లో పనిచేసే పనిమనిషి, కంప్యూటర్ ఆపరేటర్‌ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆరోజు ఏం జరిగిందనే దానిపై వారి ముగ్గురిని సునీత సమక్షంలో ప్రశ్నిస్తున్నారు.
ఇదీచదవండి