ప్రభుత్వ పాఠశాలలను కొంగొత్త హంగులతో తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టరు సి.హరికిరణ్ పేర్కొన్నారు. గురువారం ఒంటిమిట్ట మండలంలోని మంటపంపల్లె పంచాయతీ రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో ‘మనబడి నాడు- నేడు’ పనులను కలెక్టరు, సంయుక్త పాలనాధికారి సాయికాంత్‌శర్మ, శిక్షణ కలెక్టరు వికాస్‌తో కలిసి పరిశీలించారు. ఆట వస్తువుల నాణ్యతను తనిఖీ చేశారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సుమారు 3,600 ఉన్నాయన్న కలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తొలి విడతలో 1,048 బడుల్లో నాడు- నేడు పనులు చేపట్టామన్నారు. జులై చివరిలోపు అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించామని వివరించారు. ఆగస్టులో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయంటూ అంగన్వాడీ కేంద్రాల్లోనూ ‘నాడు- నేడు’ కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
కలెక్టర్ తోపాటుగా ఆర్డీవో పి.ధర్మచంద్రారెడ్డి, తహసీల్దారు పి.విజయకుమారి, ఎంపీడీవో జి.కృష్ణయ్య, ఎంఈవో జి.వెంకటసుబ్బయ్య, ఏఈలు బి.సుబ్రహ్మణ్యం, సి.దినేష్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: చైనాతో వివాదంపై నేడు ప్రధాని అఖిలపక్ష భేటీ