కడప జిల్లా రాజుపాళెం మండలంలోని అయ్యవారిపల్లె గ్రామంలో గురువారం రాత్రి వైకాపా, భాజపా వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కృష్ణంరాజు నాయక్, ఏఎస్సై సుబ్బారెడ్డి, సిబ్బంది గ్రామానికి చేరుకుని క్షతగాత్రులను వైద్యం కోసం 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని గోపు చిన్న నరసింహులు, పెద్ద నరసింహులు ఒక వర్గం కాగా మరో వర్గానికి చెందిన నూకలబోయిన రవీంద్రల మధ్య గత కొన్ని నెలలుగా ఇంటి వద్ద దారి సమస్య నెలకొంది. గురువారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఈ విషయంపై వాగ్వాదం చోటుచేసుకుని అది పెద్దగా మారింది. దీంతో వారు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలు కాగా మరో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి.
గోపు ప్రసాద్‌కు కత్తి వేటుతో పేగులు బయట పడ్డాయి. చిన్న నరసింహులుకు ఛాతిపై, లక్ష్మీ నరసింహులుకు చేతిపై గాయమైంది. మరో వర్గానికి చెందిన రవీంద్ర, వెంకటేశ్‌కు కూడా తలపై గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారికి గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నారు. వైకాపా నాయకుడు రవీంద్ర, భాజపా నాయకుడు ప్రసాద్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో మొదట ప్రొద్దుటూరుకు అనంతరం కడప ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి