కడప జిల్లాలో ఈ ఏడాది ఎస్సీ విద్యార్థులకు ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’లో ప్రవేశాలు లేనట్టే. ఇప్పటికే విద్యార్థులను సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల్లో సర్దుబాటు చేస్తున్నారు. 9, 10 తరగతులు మినహా అన్ని తరగతుల్లో ప్రవేశాలు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలను బీఏఎస్గా ఎంపిక చేసింది. ఎస్సీ విద్యార్థులను ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఆయా పాఠశాలల్లో రెసిడెన్షియల్/నాన్‌రెసిడెన్షియల్ ప్రవేశాలు కల్పించేవారు. నాన్ రెసిడెన్షియల్ విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు, రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.35 వేలు ఆయా పాఠశాలలకు చెల్లిస్తూ వచ్చారు. 2020-21 విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 1,890 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాటిల్లో వీరి కొనసాగింపు నిలిచిపోయింది. దీంతో విద్యార్థుల్లో 2 నుంచి 5వ తరగతి చదివే వారిని జిల్లాలోని సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాలు/పాఠశాలల్లో చేర్పిస్తుండగా, 6వ తరగతి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ నెల 27వ తేదీ నుంచి జిల్లా కేంద్రమైన కడప నగర శివార్లలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 15 సాంఘిక సంక్షేమశాఖ గురుకులాలున్నాయి. వీటిల్లో 4 బాలురకు, 11 బాలికలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో బీఏఎస్లల్లో ప్రవేశాలను చేపట్టకపోవడం, పాత విద్యార్థులను ఆ పాఠశాలల్లో కొనసాగించకపోవడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమ పిల్లలను బీఏఎస్ల్లోనే కొనసాగించాలని కోరుతూ వారు కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాబోధన, వసతులు సక్రమంగా లేనందున ఎస్సీ విద్యార్థులను సాంఘిక సంక్షేమశాఖకు చెందిన విద్యాలయాల్లో చేర్చాలని నిర్ణయించినట్లు సమాచారం.
అందరికీ ప్రవేశాలు కల్పిస్తాం
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 2 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థులందరికీ సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాలు, గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తాం. ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో విద్యార్థులు పాల్గొంటున్నారు. వారికి కావాల్సిన పాఠశాలలు/వసతి గృహాలను ఎంపిక చేసుకుంటున్నారు. సాంఘిక సంక్షేమశాఖకు చెందిన విద్యా సంస్థల్లో బోధన, వసతులు తదితర అంశాల్లో ప్రమాణాలు పెరిగాయి. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాల పనితీరు సక్రమంగా లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. - జయప్రకాశ్, జేడీ, సాంఘిక సంక్షేమశాఖ
ఇదీ చదవండి: