కడప జిల్లా బద్వేలు ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలి
ఉపఎన్నికల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికపై మండలాల వారీగా బూత్ కన్వీనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ బద్వేలు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నారని అన్నారు. ఎన్నికను సీరియస్‌గా తీసుకొని..ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు.
లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి ప్రభుత్వం పని చేస్తోందని..మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 90 శాతానికి పైగా అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బద్వేలు ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్‌పై మీకున్న అభిమానం తెలిపేందుకు ఇదొక అవకాశంగా తీసుకోవాలన్నారు. లక్ష ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్థిని గెలిపించి జగన్ రుణం తీర్చుకోవాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. బూత్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు, అంజాద్ బాషా, నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాశ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనసేన, తెదేపా దూరం
బద్వేలు ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. మరణించిన ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చినందున మానవతా దృక్పథంతోనే బద్వేలులో పోటీ చేయడం లేదన్నారు. నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బద్వేలు ఉపఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశంలో..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే అధికార వైకాపా టికెట్ ఇవ్వటంతో..ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించినట్లు తెదేపా తెలిపింది.
వారసత్వాలను ప్రోత్సహించం: భాజపా
బద్వేలు ఉపఎన్నికను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేలు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వాలను భాజపా ప్రోత్సహించదని ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణిస్తే.. ఆయన భార్య పోటీ చేసినంత మాత్రానా తప్పుకోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి
By Election Schedule 2021: బద్వేలు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల