కడప జిల్లా తెలుగుగంగ పథకంలో భాగమైన బ్రహ్మంసాగర్ జలాశయంలో నీటిమట్టం పెరిగేకొద్దీ కట్ట లీకేజీ పెరుగుతుంది. అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయంలోకి నీటి చేరికను తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె వద్ద గోడేరు వంకలోకి నీటిని మళ్లించారు. 17.77 టీఎంసీలు సామర్థ్యం కలిగిన జలాశయంలోకి ప్రస్తుతం 14.3 టీఎంసీలకు నీరు చేరింది. 2009లో 12 టీఎంసీలకే కట్ట లీకేజీ బయటపడగా మరమ్మతుల్లో జాప్యం చేశారు.
ఈ సంవత్సరం జలాశయం నీటి నిల్వ పెంచేందుకు నిర్ణయం తీసుకున్న అధికారులు.. ఈమేరకు నీటినిల్వను పెంచుతూ వచ్చారు. గతంలోగానే లీకేజీ బయటపడింది. నీటిమట్టం పెరిగే కొద్దీ లీకేజీ పెరగడాన్ని గుర్తించారు. ఎగువ కర్నూలు జిల్లా వెలుగోడు నుంచి తెలుగుగంగ కాల్వకు నీరు నిలుపుదల చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జలాశయంలోకి నీటి చేరికను తగ్గించేలా మార్గమధ్యంలో వంకలకు మళ్లిస్తున్నారు.
ఇదీ చూడండి. తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై హత్యాయత్నం