AR Constable Suicide: ఆర్థిక సమస్యలు ఆ కానిస్టేబుల్ మరణానికి కారణమయ్యాయి. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు డ్యాన్స్ పాఠశాలను ఏర్పాటు చేసి పలువురు విద్యార్థులకు డ్యాన్స్ నేర్పిస్తున్నారు. అంత బానే ఉంది అనుకున్న క్రమంలోనే ఆర్థిక పరమైన ఇబ్బందులు కారణంగా ఆ కానిస్టేబుల్ అప్పులు ఎక్కువ చేసుకోవడంతో పాటు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన జె.శివప్రసాద్ కడపలో ఆర్ముడు రిజర్వ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శివప్రసాద్‌కు డ్యాన్స్ అంటే అమితమైన ఇష్టం. అతను డ్యాన్సర్ కూడా కావడంతో ఓ వైపు కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ మరో వైపు పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా అప్పులు చేసి.. వాటిని తీర్చే పరిస్థితి లేక అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ శివ ప్రసాద్ తన భార్యను పుట్టింటికి పంపించి తాను కడప శివారులోని రాజంపేట బైపాస్ వద్ద ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. 15వ తేదీన ఖాళీ చేస్తానని చెప్పాడు. సాయంత్రం లాడ్జి నిర్వాహకులు శివప్రసాద్ గదికి వెళ్లి తలుపు తట్టగా అతని ఎంతసేపటికి తీయలేదు. కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు.
వెంటనే లాడ్జి సిబ్బంది పోలీసులకు సమచారం అందించారు. రిమ్స్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేవలం ఆర్థిక సమస్యలేనా లేకుంటే ఇటీవలె జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన జీవీ ఫుట్‌బాల్ ఆటలో పెట్టుబడి పెట్టాడా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఒక కడప నగరంలోని సుమారు 600 మంది పోలీసులు జీవీ ఫుట్‌బాల్ అనే ఆన్లైన్ గేమ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఇటీవల జీవీ ఫుట్‌బాల్ ఆట రద్దు కావడంతో అందులో పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాకపోవడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. శివ ప్రసాద్ కూడా ఇందులో పెట్టుబడులు పెట్టి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: