AP Govt Advisor Nagarjuna Reddy comments: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజాప్రతినిధులకు రానురానూ గౌరవం లేకుండా పోతుందని.. రాష్ట్ర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ సలహాదారు నాగార్జున రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కడప జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయించడం ద్వారా ప్రజల్లో ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం లేకుండా పోతుందన్నారు.
అనంతరం ప్రభుత్వ పథకాలు ప్రజలకు పంపిణీ చేసే సమయంలో కనీసం ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం లేదని.. ఇది మంచి పరిణామం కాదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో కూడా సచివాలయ వ్యవస్థ గురించి ప్రస్తావించానని నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు ఆసుపత్రిలో కూడా సరైన వైద్యం అందడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో వ్యాధుల జాబితా ఉన్నప్పటికీ ఆసుపత్రి యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సచివాలయ వ్యవస్థ సరిగా పని చేయకపోవడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఒక సలహాదారుడిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నానని నాగార్జున రెడ్డి పేర్కొన్నారు.
2019 అక్టోబర్ 2వ తేదీ(గాంధీ జయంతి)న ముఖ్యమంత్రి జగన్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కరప గ్రామంలో 'గ్రామ సచివాలయ వ్యవస్థ'కు శ్రీకారం చుట్టారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని రకాల సేవలను, ప్రభుత్వ పథకాలను సచివాలయ ఉద్యోగులు నేరుగా వెళ్లి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ వల్ల వార్డ్ మెంబర్ నుంచి మొదలుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ వంటి వారిని ప్రజలు చిన్నచూపు చూస్తున్నారు. ఈ పరిస్థితి గురించి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాను. దానికి ఆయన సానుకూలంగా స్పందించి..అన్ని జిల్లాలు తిరిగి, వాలంటీర్లతో సమావేశాలు పెట్టి అనగాహన కల్పించండని అన్నారు. ప్రజాప్రతినిధులను గౌరవించాలని అన్నమయ్య జిల్లాలో జరిగిన సమావేశంలో స్పష్టంగా చెప్పాము. ప్రభుత్వ పథకాలు ప్రజలకు పంపిణీ చేసే సమయంలో ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం లేదు. ఇది మంచి పరిణామం కాదు.-నాగార్జున రెడ్డి, పంచాయతీ రాజ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
ఇవీ చదవండి