Uttarandhra MLC election results updates: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 13వ తేదీన జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) కీలక ఉత్తర్వులను జారీ చేసింది. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక పోలింగ్ రోజున హైకోర్టుకు సెలవులు ఇచ్చి.. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదంటూ.. న్యాయవాది శ్రీనివాసరావు హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ఎన్నికల ఫలితాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేస్తూ, మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పిటిషన్‌కు సంబంధించిన తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. మార్చి 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అందులో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి (తూర్పు రాయలసీమ), కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి (పశ్చిమ రాయలసీమ), శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి (ఉత్తరాంధ్ర), ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ అయిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం (16వ తేదీ) చేపట్టనున్నారు.
ఈ క్రమంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక పోలింగ్ రోజున హైకోర్టుకు సెలవులు ఇచ్చి.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదంటూ.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన న్యాయవాది శ్రీనివాసరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు.. విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా పిటిషనర్ తరపున న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. ''ఎన్నికలు జరగని చోట హైకోర్టుకు సెలవులు ఇచ్చి.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదు. దీనివల్ల పోటీ చేసిన న్యాయవాది శ్రీనివాస్‌కు న్యాయవాదులు, కక్షిదారులు, ఉద్యోగులు ఓటు వేయలేకపోయారు. రాజ్యాంగపరమైన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోయారు'' అంటూ పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. ఓట్ల లెక్కింపు జరిగినప్పటికీ ఫలితం తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలియజేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా గురువారం వెల్లడి కావాల్సిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వాయిదా పడింది. కానీ, మిగతా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు మాత్రం 16వ తేదీనే వెల్లడికానున్నాయి.
ఇవీ చదవండి