కరవు పీడిత ప్రాంతమైన రాయచోటి నియోజకవర్గంలో సాగు తాగునీటి కొరత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నియోజకవర్గ పరిధిలో ఉన్న వెలిగల్లు, ఝర్రీ కోన ప్రాజెక్టుల నుంచి రెండు భారీ ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు తాజాగా ప్రభుత్వం రూ 136.75 కోట్ల రూపాయల నిధులకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ బుధవారం జీవో నెంబర్ లు 570, 571 విడుదల చేసింది.
వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 0.40 టీఎంసీల నీటిని దిగువ గొట్టి వీడుకు తీసుకొచ్చి అక్కడ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా రాయచోటి గాలివీడు మండలంలోని అరవీడు, గోరాన్ చెరువు, గుండ్ల చెరువు చీమల చెరువు ఎగువ గొట్టి వీడు ఏపీ లంకపల్లి గ్రామాలకు సాగు తాగునీటిని అందించేందుకు ఈ పథకం రూపొందించారు. ఇప్పటికే 4.67 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన వెలిగల్లు నుంచి రాయచోటికి తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఉన్న 24 వేల ఎకరాల ఆయకట్టుకు కుడి ఎడమ కాల్వల ద్వారా సాగునీరు ఇవ్వాల్సి ఉండగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన ఒక్కసారి కూడా ప్రాజెక్టు నుండి ఆయకట్టుకు నీరు ఇచ్చిన పరిస్థితి లేదు. అయినప్పటికీ ప్రభుత్వం మరో ఎత్తిపోతల పథకం తీసుకురావడం ఈ ప్రాంత వాసుల్లో తాగు సాగు నీటి అవసరాలు తీరుతాయని ఆశిస్తున్నారు.
రూ 42.25 కోట్లతో ఝర్రీకోన ఎత్తిపోతల పథకం
కడప చిత్తూరు జిల్లాల సరిహద్దులో నిర్మించిన ఝర్రికోన ప్రాజెక్టు నుంచి 607 ఎంసీఎఫ్టీల నీటిని సంబేపల్లి మండలం శెట్టిపల్లె గ్రామంలోని పెద్ద చెరువుకు నీటి నింపేలా పథకాన్ని రూపొందించారు. అక్కడ నుంచి అనుబంధంగా ఉన్న మండలంలోని 19 చెరువులకు నీరు చేరుతుంది. సంబేపల్లి చిన్నమండెం మండలంలోని గ్రామాలకు తాగునీటిని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 2007లో ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఇప్పటివరకు రాయచోటి నియోజకవర్గంలోని ఒక ఎకకు కూడా సాగునీరు ఇచ్చిన దాఖలాలు లేవు దిగువన ఉన్న సుండుపల్లి మండలానికి తూము ద్వారా నీటి విడుదల చేశారు తప్ప నిర్మాణ సమయంలో నిర్ధారించిన ఆయకట్టుకు చుక్క నీరు ఇచ్చిన పాపాన పోలేదు ఇదే ప్రాజెక్టు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని కె.వి పల్లి కలకడ కలికిరి మండలాలకు తాగునీటిని తీసుకెళ్లే పథకాలను ఏర్పాటు చేయించారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే తప్ప ఈ ప్రాజెక్టు నీరు రాయచోటి నియోజకవర్గానికి వచ్చే అవకాశం లేదు.
ఇవీ చదవండి