Bought a Bike with Ten Rupees Coins in AP: సాధారణంగా ఎవరైనా బైక్ కొనుగోలు చేస్తే పెద్ద మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది కాబట్టి నోట్లు రూపేనా అందులోనూ పెద్ద నోట్లు రూపంలోనూ ఆన్లైన్లో నగదు బదిలీ ద్వారా చెల్లించడం అందరికీ తెలిసిందే. మరికొద్ది మంది తమ వెసులుబాటును బట్టి చెక్కు, డిమాండ్ డ్రాప్ట్ల రూపంలోనూ చెల్లిస్తుంటారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఒక యువకుడు మాత్రం తాను కొనుగోలు చేసిన బైక్కు సంబందించిన డబ్బులను పది రూపాయల నాణేలు చెల్లించాడు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన బొబ్బిలి రాఘవేంద్ర హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన రోజువారి అవసరాలు నిమిత్తం బైక్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు రాఘవేంద్ర. అందుకోసం హీరో కంపెనీకి చెందిన బైక్‌ను ఎంపిక చేసుకున్నాడు. బైక్ ఖరీదు ₹1,65,000 కావడంతో తన జీవితంలో జ్ఞాపకంగా మిగిలిపోవాలని పది రూపాయల నాణేలతో కొనుగోలు చేయడానికి నిర్ణయించుకున్నాడు. మొదట్లో దుకాణ యజమాని కొంత వెనక్కి తగ్గినా, అనంతరం పది రూపాయల కాయిన్స్ చెల్లుబాటు అవుతాయని అతనికి అర్థమయ్యేలా తెలియజేశాడు. ప్రజల్లో అవగాహన కోసమే తాను ఇలా బైక్ కొంటున్నట్లు తెలపడంతో ఆ దుకాణ యజమాని దానికి అంగీకరించాడు. అనంతరం ఆ మొత్తాన్ని దుకాణ యజమానికి చెల్లించిన రాఘవేంద్ర.. బైక్‌ను సొంతం చేసుకున్నాడు.
బైక్ కొనుగోలు జ్ఞాపకంగా మిగిలిపోవడానికి, అలాగే పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావనే అపోహ పోవడానికి తాను నాణేలతో కొనుగోలు చేసినట్లు రాఘవేంద్ర తెలిపాడు. రాఘవేంద్ర తమని సంప్రదించినప్పుడు ఆలోచించినా, తాను చెప్పిన వివరణ నచ్చటంతో నాణేలు తీసుకుని బైక్ అమ్మినట్లు దుకాణ యజమాని తెలిపారు. తమ దుకాణం ఏర్పాటు చేసిన తర్వాత 40 ఏళ్ల చరిత్రలో నాణాలతో బైక్ అమ్మడం ఇదే మొదటిసారి యజమాని తెలిపారు.
'నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాను, నేను కొనుగోలు చేసే బైక్ నా జీవితాంతం గుర్తుండిపోవాలని నిర్ణయించుకున్నాను. అంతే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఆలోచన సైతం నాలో కలిగింది. అందుకనే పది రూపాయల నాణేలతో బైక్ కొనడం ద్వారా ప్రజల్లో పదిరూపాయల నాణేలు చెల్లవు అనే అపోహను సైతం పొగొట్టవచ్చు అనే ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేశాను. మెుదట షోరూం వారు తన ఆలోచనపై వెనకడుగు వేశారు. నేను చెప్పిన కారణం నచ్చి, ఆ తరువాత వారు మళ్లీ తనకు బైక్ అమ్మడానికి ముందుకు వచ్చారు. నేను సేకరించిన పది రూపాయల నాణేలతోనే బైక్ కొనుగోలు చేశాను, ఈ సంఘటన నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.' బొబ్బిలి రాఘవేంద్ర
ఇవీ చదవండి: