పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలని వైకాపా శ్రేణులు గురువారం రాత్రి భీమవరం పట్టణంలోని రెండో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వైకాపా ఎస్సీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్.. ఎస్సై రాంబాబుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంపీ గోబ్యాక్.. అంటూ నినాదాలు చేశారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు కుల, మత వర్గాల్లో వైషమ్యాలు సృష్టించి వ్యక్తిగత ప్రయోజనాలను పొందాలనుకుంటున్నారని వైకాపా నేతలు అన్నారు. ఆయన తీరును ఖండిస్తున్నామని, ఎంపీని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఏడాది కాలంగా కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, దురదృష్టవశాత్తూ అనేకమంది కరోనా బారినపడి మృతి చెందారని అటువంటి సమయంలో ఒక్కసారి కూడా వారిని పలకరించడానికి భీమవరం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మూడు రోజులపాటు భీమవరంలో ఉండి ప్రజల కష్టాలను పరిష్కరిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ప్రజలు సీఎం జగన్ పిలుపుమేరకు ఎంపీగా గెలిపిస్తే.. గడిచిన ఏడాదిన్నర కాలంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారంటూ ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజల కష్టాలను పట్టించుకోకుండా దిల్లీలో, హైదరాబాద్లో తిరుగుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు భీమవరం వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం ఆయన రాజకీయ అవివేకానికి నిదర్శనమన్నారు.
ఇదీ చదవండి: ప్రజాస్వామ్యాన్ని వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు