worst Roads in West Godavari district : పశ్చిమగోదావరి జిల్లాలో ఏ మూలకు వెళ్లినా రోడ్ల పరిస్థితి ఇదే. అడుగడుగునా గుంతలు, గోతులతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఎక్కడ చూసినా కంకర తేలిన రోడ్లే దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్లైతే మోకాళ్ల లోతు గుంతలతో ప్రయాణం చేయడం అసాధ్యమనే దుస్థితి నెలకొంది. వర్షాకాలమైతే గుంతల్లో నీరు చేరి.. రోడ్లు సరిగా కనిపించని దారుణ పరిస్థితులు ఉంటున్నాయి.
ఆ మార్గాల్లో వెళ్లాలంటేనే..
రోడ్లు దుస్థితి కారణంగా జిల్లా కేంద్రం ఏలూరు నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, పాలకొల్లు లాంటి ప్రధాన పట్టణాలకు వెళ్లాలంటే.. జనం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. భీమవరం నుంచి గణపవరం, తాడేపల్లిగూడెం, తణుకు వెళ్లే రహదారి సైతం అధ్వాన్నంగా మారింది.
ఆ దారిలో వెళ్తే రిపేరు చేయించాల్సిందే..
ప్రధానమైన తాడేపల్లిగూడెం - నిడదవోలు - రాజమహేంద్రవరం రహదారి ప్రయాణికులకు చుక్కలు చూపెడుతోంది. ఎటుచూసినా గోతులతో నిండిన మార్గంలో ప్రయాణం చేయడమంటే.. అగ్నిపరీక్ష ఎదుర్కొన్నట్లేనని వాహనదారులు అంటున్నారు. ఒకసారి ఈ దారిలో వెళ్లామంటే వాహనం కచ్చితంగా రిపేరు చేయించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
కొత్త వాహనమైన సరే..
ఈ నరకపు దారుల్లో ప్రయాణిస్తే.. కొత్త వాహనాలైనా సరే, రెండు మూడు రోజులకే విడిభాగాలు ఊడిపోతున్నాయని వాపోతున్నారు. ఈ రోడ్లపై తిరిగిన ఏడాదికే వాహనం మూలన పడుతోందని అంటున్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయాలని ప్రయాణికులు, వాహనాల యజమానులు కోరుతున్నారు.
ఇదీ చదవండి