ఏళ్ల తరబడి పెంచుకుంటూ వస్తున్న కొబ్బరి చెట్లను గుల్లబారుస్తూ.. తెల్లదోమ రైతుల ఆదాయానికి గండికొడుతోంది. ఎకరాలకు ఎకరాల తోటలున్నా పైసా వచ్చే పరిస్థితి కన్పించక అన్నదాతలు ఆర్థికంగా చితికిపోతున్నారు. రూగోస్ పేరుతో పిలిచే సర్పిలాకార దోమ నాలుగేళ్ల కిందట విదేశాల నుంచి వచ్చిది... తొలుత కేరళకు, అక్కడ నుంచి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చేరింది. లక్షలాది ఎకరాల్లో కొబ్బరికి భారీగా నష్టం కలిగించింది. తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో సాగునే కనుమరుగు చేసింది. ఇది క్రమంగా ఇతర పంటలనూ ఆశిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర జిల్లాల్లోని కొబ్బరి, ఆయిల్‌పామ్, ఇతర ఉద్యాన పంటల రైతుల్ని కలవరపరుస్తోంది.
రసం పీల్చే తరగతికి చెందిన ఈ దోమ కొబ్బరి ఆకులపై తెల్లని నూలుపోగులాంటి జిగురును విసర్జిస్తుంది. దీనికోసం వచ్చే శిలీంద్రం.. జిగురుతోపాటు ఆకుల్లోని పత్రహరితాన్ని పీలుస్తాయి. చెట్టు ఎదుగుదల నిలిచిపోతోంది. దిగుబడి పడిపోతోంది. కిరణజన్య సంయోగక్రియ జరగక ఆకులతో సహా చెట్టు ఎండుముఖం పడుతుంది. ఎండలు పెరిగేకొద్దీ దోమ మరింత విజృంభిస్తుంది. ప్రస్తుత వాతావరణం దీనికి అనుకూలంగా ఉండటంతో ప్రభావం అధికమైంది. పండ్లతోటలే కాకుండా.. కరివేపాకు, ఇతర ఆకుకూరలతో సహా సుమారు 113 రకాల మొక్కలను ఇది ఆశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
సహజ శత్రువులతోనే ఈ దోమను నిర్మూలించొచ్చని అధికారులు చెబుతున్నారు. కందిరీగ జాతికి చెందిన ఎన్‌కార్సియ గోడెలోపి, టెంక రెక్కల పురుగులు, సాలెపురుగులు దీని ఉద్ధృతి పెరగకుండా నియంత్రిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 0.5% వేపనూనె పిచికారి చేయాలి. రైతులు ఎవరంతట వారు మందులు చల్లినా దోమ నియంత్రణ కష్టమేనని.. సామూహిక సస్యరక్షణ చర్యలు చేపడితే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వమే ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు
ఇదీ చదవండి : స్థానిక ఎన్నికలయ్యాక మంత్రి మండలిలో మార్పులు