west godavari student in ukraine: పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన రాచమల్ల పోతురాజు కుమారుడు ధన సత్యసాయి ఉక్రెయిన్ లోని ఒడెస్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. విశ్వవిద్యాలయం పక్కనే ఉన్న విమానాశ్రయంపై.. బాంబులు వేయడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. యూనివర్సిటీలోని హాస్టల్లో ఉంటున్న వీరు.. ప్రస్తుతం హాస్టల్ అండర్ గ్రౌండ్లో ఉన్న బంకర్లో తలదాచుకున్నారు. రెండు రోజులపాటు తిండి తిప్పలు లేక ఆకలికి అలమటిస్తున్నారు. చివరకు ఎంబసీ అధికారులు ఏర్పాటు చేసిన బస్సులలో రుమేనియా చేరుకోవడానికి బయలుదేరారు.
9 లేదా 10 గంటల వ్యవధిలో రుమేనియా చేరుకోవాల్సి ఉండగా.. 24 గంటలు గడిచినా అక్కడకు చేరుకోలేకపోయారు. ఒడెస్సా రాష్ట్రం నుంచి రుమేనియా చేరుకునే మార్గమధ్యంలో.. సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆలస్యం అవుతున్నట్లు సత్యసాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబ సభ్యులను.. మండల రెవెన్యూ అధికారి కనకరాజు పరామర్శించి.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. భారత ప్రభుత్వం ఎంబసీ ద్వారా బాధితులందర్నీ స్వదేశాలకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు.
తమ కుమారుడి పరిస్థితి పట్ల చాలా ఆందోళన చెందుతున్నామని ధన సత్య సాయి తండ్రి పోతురాజు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: