పశ్చిమ గోదావరి జిల్లాలో కూరగాయలు, ఆకుకూరల ధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. గత నెలలో కాస్తోకూస్తో అందుబాటులో ఉన్న ధరలు.. ఈనెలలో ఆకాశాన్ని అంటుతున్నాయి. భారీ వర్షాలు, వరద వల్ల.. పలుప్రాంతాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఇదే అదునుగా దళారీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. దీంతో ఏ కూరగాయ కొనాలన్నా.. సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. కూరల్లో ప్రధానంగా వినియోగించే టామాటా, ఉల్లి ధరలు వంద శాతానికి పైగా పెరిగాయి. విపరీతంగా పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధరలు విపరీతంగా పెరిగాయి. రైతు బాజార్లలోను ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు. పండుగలు సీజన్ కావడంతో దళారీలు చెప్పిందే ధర అవుతోంది. గత నెలలో అన్ని కూరగాయల ధరలు కిలో 30రూపాయల లోపు ఉండేవి. ప్రస్తుతం అన్ని కూరగాయలు సగటు కిలో 50రూపాయలుగా ఉన్నాయి. వీటికితోడు ఆకుకూరల ధరలు పెంచేశారు. కొత్తిమీర కట్ట 25రూపాయలకు విక్రయిస్తున్నారు. మిగతా ఆకుకూరలు కట్ట 20రూపాయలకు విక్రయిస్తున్నారు. గత నెలలో కూరగాయలు కొనడానికి 250రూపాయలు అయ్యేదని.. ప్రస్తుతం ఐదు వందల రూపాయలైనా సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మార్కెట్లో ధరలు మరింత పెరిగితే కొనలేమని.. దళారీలను నియంత్రించి.. ధరలు అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
'పది రోజుల్లో కూరగాయల ధరలు ఊహించని విధంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సంత మార్కెట్లో ఏవి కొనాలన్నా వందల రూపాయలు వెచ్చించాల్సిందే. కొనడానికి వెళ్తే ఏదైనా కిలో రూ.50 పలుకుతోంది. ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది' - గోపీకృష్ణ, వినియోగదారుడు
సగమే వస్తున్నాయి
'కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. గత నెల డబ్బులకు ఇప్పుడు సగమే వస్తున్నాయి. కొన్ని రకాలు దొరకటమే గగనమవుతోంది. ధరలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అన్నివర్గాలకు ఆర్థిక భారంగా పరిణమించింది. కుటుంబ బడ్జెట్ గాడి తప్పుతోంది. కూరగాయలే కాదు..ఇతర నిత్యవసరాల ధరలు భారీగా పెరిగాయి.' - సూర్యారావు, ఏలూరు.
ఇదీ చదవండి: