పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం పనులు పూర్తి చేసేందుకు 2021 మార్చి నెలాఖరుకు పంట కాలువలకు సాగునీటి విడుదల నిలిపి వేస్తామని అధికారులు ప్రకటించారు. ఈలోగా రైతులు రబీ సాగు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. దాళ్వా గట్టెక్కాలంటే వ్యవసాయ, జల వనరులు, రెవెన్యూ, ఏపీఐడీసీ సంస్థల అధికారులు సమష్టిగా కృషి చేయాల్సిందే. వంతుల వారీగా కాలువలకు నీటి విడుదల చేసినా.. చివరిలో ఆరుదల తడుల కోసం ఎత్తిపోతల పథకాలపై ఆధారపడాల్సిందే. అంటే ఇప్పట్నుంచే వాటిని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నిర్వహణ కమిటీలను ప్రభుత్వం ఇటీవల రద్దు చేయడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో అవన్నీ నడుస్తున్నాయి.
రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడి నుంచే విత్తనాలు సరఫరా చేయాలని భావించింది. కాని పంపిణీలో చోటు చేసుకున్న జాప్యంతో పల్లెల్లో దళారుల దందా మొదలైంది. 30 కిలోలు ఉండే ఎంటీయూ 1121 విత్తనాల ప్యాకెట్ ధర రూ.950 అని నిర్ణయించగా దళారుల రూ.1050 వరకు విక్రయించారు. ఖరీఫ్ పంటను ఒబ్బిడి చేసుకోవడం, నివర్ తుపాన్ వల్ల జరిగిన పంట నష్టం వివరాలను నమోదు చేయించుకునే పనుల వల్ల రబీ విత్తనాల కోసం ఆధార్‌కార్డులు పట్టుకుని భరోసా కేంద్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు.
ఆలస్యంగా సాగు
డెల్టాలో ఖరీఫ్ నాట్లు వేయడంలో తొలుత ఆలస్యమైంది. దీనికి తోడు తుపాన్ కారణంగా పంట పూర్తిగా నేలకొరగడం.. తద్వారా కోతలు ఆలస్యం కావడంతో మాసూళ్లు సకాలంలో పూర్తికాలేదు. ఈ ప్రభావం రబీ సాగుపై పడి... నాలుగు రోజుల కిందటి వరకు 50 శాతం కూడా నాట్లు పడని పరిస్థితి నెలకొంది. యలమంచిలి మండలంలో అయితే కేవలం 9 శాతం మాత్రమే పూర్తికావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ రైతులను చైతన్య పరుస్తున్నారు. జనవరి 15 నాటికి నాట్లు పూర్తి చేయాలని కోరుతున్నారు. అయితే ఈ నెలాఖరు వరకు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే చివరిలో నీటి ఎద్దడి నుంచి గట్టెక్కాలంటే ఎత్తిపోతల పథకాలే శరణ్యం.
పాత కమిటీలపైనే భారం
ఎత్తిపోతల కమిటీలను ప్రభుత్వం రద్దు చేసినా నిర్వహణ భారం వారే అనధికారికంగా భరించాల్సి వస్తోంది. ప్రత్యేకాధికారులు సంతకాలకే పరిమితం గాని వారి వల్ల నిర్వహణ అయ్యే పనికాదని సీనియర్ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. కమిటీలను రబీ అనంతరం రద్దు చేస్తే ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో అంత ఇబ్బంది ఉండేది కాదన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో విద్యుత్తు బిల్లులు మినహా మిగిలిన పనులన్ని కమిటీలే చూసుకుంటుంటాయి. రబీకి సంబంధించి మార్చి ఆఖరుకు కాలువలకు నీటి విడుదల నిలిపివేస్తే ఎత్తిపోతలే కీలకం కానున్నాయి. ప్రస్తుతం మైప, యలమంచిలి మండలం శిరగాలపల్లి, పెనుమర్రు ఎత్తిపోతల పథకాల నిర్వహణలో ఇబ్బందులున్నాయి. మైప పథకాన్ని డ్రెయిన్ నుంచి జలవనరుల శాఖకు సంబంధించిన ఛానల్‌కు మార్చాలనే ప్రతిపాదనలున్నాయి. నక్కల డ్రెయిన్‌పై ఉన్న శిరగాలపల్లి, పెనుమర్రు ఎత్తి పోతల ద్వారా ఉప్పు నీరు వస్తోందని రైతులు వ్యతిరేకించడంతో మూడేళ్లుగా మూతపడే ఉన్నాయి. వీటి నిర్వహణ కమిటీలు కూడా మనుగడలో లేవు. శివారు ప్రాంతాల్లో రబీ పంట గట్టెక్కాలంటే వీటిని వాడుకలోకి తీసుకురావాల్సి ఉంది.
నిర్వహణ చూసుకోవాలి
అవసరం ఉన్నప్పుడు కాకుండా మామూలు రోజుల్లో కూడా ఎత్తిపోతల నిర్వహణను కమిటీలే చూసుకోవాలి. లేకపోతే అత్యవసరంలో అవి ఉపయోగపడకపోవచ్చు. ప్రస్తుతం ప్రతి ఎత్తిపోతలకు డీ…ఈ స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాం. బాగానే పనిచేస్తున్నాయి. తాత్కాలికంగా నీరు ఎత్తిపోయాల్సిన ప్రాంతాలను జలవనరుల శాఖ గుర్తిస్తోంది. ప్రతి పథకం వద్ద సరిపడా సిబ్బందిని ఉంచి సక్రమంగా పని చేసేలా ప్రణాళికలు రూపొందించాం. - డి.నరసింహారావు, ఈఈ, ఏపీఐడీసీ, ఏలూరు