పోలవరం ప్రాజెక్టులో ఎప్పటినుంచో పెండింగులో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు వీలుగా బుధవారం దిల్లీలోని కేంద్ర జలశక్తిశాఖ కార్యాలయంలో కీలక భేటీ ఏర్పాటుచేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ నెల 4న పోలవరం సందర్శించినప్పుడు జరిగిన చర్చల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఆయన హాజరుకాకున్నా కేంద్ర జలశక్తిశాఖలోని ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, సభ్య కార్యదర్శి హాజరవుతారు. ఏపీ జలవనరులశాఖ ఉన్నతాధికారులు, పోలవరం అధికారులు, ఇతర ఇంజినీర్లు మంగళవారం రాత్రే దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర జలసంఘం సభ్యులు, కేంద్ర జలవిద్యుత్ పరిశోధన కేంద్రం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్ నిపుణులు, డ్యాండిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు హాజరవుతున్నారు.
ఈ ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగాలంటే ప్రధానంగా నిధుల సమస్య పరిష్కారంతోపాటు ఆకృతులు ఆమోదం పొందాల్సి ఉంది. అవసరమైన ఆకృతులన్నీ ఆమోదిస్తే పనులు త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రికి పోలవరం పర్యటనలో గుత్తేదారు తెలిపారు. ప్రధానంగా రాతి, మట్టికట్టలో ఇసుక కోత, దిగువ కాఫర్‌డ్యాంలో ఇసుక కోత నేపథ్యంలో ఏర్పడ్డ సవాలును ఎలా ఎదుర్కొని ఆకృతులు ఖరారు చేయాలనేది ప్రధానాంశం కానుంది. కీలకమైన ప్రాజెక్టు డీపీఆర్2 ఇప్పటికీ ఆమోదం పొందలేదు. సవరించిన అంచనాల కమిటీ సిఫార్సు మేరకు రూ.47,725 కోట్ల వరకు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖలు ఆ మొత్తానికి పెట్టుబడి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి 15రోజులకోసారి బిల్లులు చెల్లించాలన్న డిమాండు రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తోంది. పనులు వేగవంతం చేసే క్రమంలో 3నెలలపాటు ప్రతి 15రోజులకోసారి పనుల పురోగతిపై సమీక్షిస్తానని కేంద్ర మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి : Polavaram works: పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తి..