ఏ విద్యా సంస్థ అయినా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిస్తేనే సంపూర్ణ ఫలితాలను సాధించినట్టవుతుంది. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆ దిశగా అడుగులు వేస్తోంది. వర్సిటీ అందిస్తున్న సేవలను గ్రామాలకు అనుసంధానం చేయాలనే యోచనతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన గ్రామం - మన విశ్వవిద్యాలయం (వైస్ ఛాన్సలర్ టు విలేజ్) కార్యక్రమంలో భాగంగా నైపుణ్యాభివృద్థి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీనిలో భాగంగా గ్రామీణ మహిళలకు, నిరుద్యోగులకు వివిధ ఉద్యాన పంటలకు సంబంధించిన విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని భావిస్తోంది. ఇందుకు వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడంతో పాటు నాబార్డు నిధులతో నిర్మించిన ఓ భవనాన్ని కూడా సిద్ధం చేసింది. త్వరలోనే కేంద్రాన్ని ప్రారంభించి మహిళలు, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
అవగాహన ఒప్పందాలు
జానకిరామ్ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్సిటీ విస్తరణ, అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఇందులో భాగంగా వర్సిటీలో రైతుల సలహా కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఉద్యాన పంటలకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందజేసేలా చర్యలు చేపట్టారు. వీసీ టు విలేజ్ కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ పరిధిలోని 43 సంస్థల ప్రాంతాల్లో ఏడాదికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని వాటిని ఆదర్శ ఉద్యాన గ్రామాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. సాగు ఖర్చులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆయా గ్రామాల్లోని రైతులకు నూతన వంగడాలు, అధునాతన సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. డ్వాక్రా, అంగన్‌వాడీ సిబ్బందికి ఉద్యాన పంటలకు సంబంధించిన విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు అనంతపురానికి చెందిన భారతీయ ఇంజినీరింగ్ సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, కడియం నర్సరీ పెంపకందారులకు చెందిన అసోసియేషన్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లతో వర్సిటీ అవగాహన ఒప్పందాలను చేసుకుంది. యూనివర్సిటీ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేసేందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మహిళలు వారు సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుని మంచి ఆదాయం పొందడంతో పాటు కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం దోహదపడనుంది.
మహిళలకు ఉపాధి కల్పించాలని..
విశ్వవిద్యాలయానికి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అనుసంధానం చేయడంతో పాటు మహిళల ఉపాధికి బాటలు వేయాలనే ఉద్దేశంతో ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా వివిధ రకాల ఉద్యాన పంటలకు సంబంధించిన విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇచ్చి మహిళల ఉపాధికి బాటలు వేయనున్నాం. ఈ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. - డాక్టర్ టి.జానకిరామ్, ఉపకులపతి
శిక్షణ కార్యక్రమాలివి..
ఎండు పూలతో అలంకరణ వస్తువులు, జ్ఞాపికలు తయారు చేయడం, బోన్సాయ్, అలంకరణ మొక్కల పెంపకం, తక్కువ స్థలంలో నాణ్యమైన సేంద్రియ కూరగాయల పెంపకం, పనస కాయ నుంచి సుమారు 50 రకాల ఉత్పత్తుల తయారీ, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం, బిస్కెట్లు, జామ్‌ల తయారీ, మహిళలు, గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించే మునగ ఆకు పొడి తయారీ, కొబ్బరి, తాటి, జీలుగ నీరా వంటి ఉత్పత్తులపై గ్రామీణ మహిళలు, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ చదవండీ...కొత్త వ్యవసాయ చట్టాల పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ