అమరావతి రైతులకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను స్వీకరించి అమరావతి రాజధానిగా ఎంపిక చేశారన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సైతం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం పట్ల మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు.
ఎన్నికల సమయంలో సైతం అమరావతిని అభివృద్ధి చేస్తామని, రాజధానిని తరలించబోమని హామీ ఇచ్చిన జగన్... ఒక సామాజికవర్గంపై కక్షతో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు. అమరావతి రైతుల త్యాగాలను విస్మరించి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని రాధాకృష్ణ మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలని రాధాకృష్ణ కోరారు.
ప్రభుత్వంలో చలనం లేకపోవటం దారుణం
రాజదాని అమరావతి కోసం రైతులు చేస్తున్న దీక్షలు 200 రోజులకు చేరినా..ప్రభుత్వంలో చలనం రాకపోవడం దారుణమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అమరావతి రైతులకు మద్దుతుగా ఆయనతో పాటు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసన దీక్ష చేశారు.