పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను పోలీసులు గృహనిర్బంధం చేశారు. చలో అమరావతి పిలుపులో భాగంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. అమరావతి రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఐకాస 3 రోజుల కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ సంఘీభావం ప్రకటించింది. నేడు జైల్ భరో కార్యక్రమం చేపట్టారు. ఇది జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ నేతలను గృహనిర్బంధం చేశారు. ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని.. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
రాజ్యాంగ పాలన పోయి రాజారెడ్డి పాలన నడుస్తోంది
రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పోయి రాజారెడ్డి పాలన నడుస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. జంగారెడ్డిగూడెంలో జైల్ భరో కార్యక్రమానికి వెళుతున్న ఆమెను పోలీసులు నిర్బంధించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను అరెస్ట్ చేయడం దారుణమని సుజాత అన్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, పోలవరం, కొవ్వూరు తదితర మండలాల్లో ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకొని గృహనిర్బంధం చేశారు.
అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నమే..
శాంతియుతంగా చేస్తున్న అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగానే రైతులపై అక్రమ కేసులు పెట్టారని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు వీరాంజనేయులు విమర్శించారు. గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి వెళ్లనీయకుండా ఆయనను పోలీసులు గృహనిర్భంధం చేశారు. దళిత రైతుపై దళిత చట్టం ఉపయోగించటం దారుణమని ఆయన మండిపడ్డారు. తనను గృహ నిర్బంధంలోకి తీసుకోవటాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా?
అమరావతి రైతులకు మద్దతుగా భీమవరం నుంచి అమరావతి బయల్దేరిన తెదేపా మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. తాము అమరావతి రైతులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్నామని.. తమను అడ్డుకోవటం సరికాదని ఆమె పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల తీరుపై తెదేపా నేతల ఆగ్రహం
ఉండి తెదేపా ఎమ్మెల్యే మంతెన రామరాజును భీమవరంలోని ఆయన స్వగృహంలో పోలీసులు గృహనిర్భంధంలోకి తీసుకున్నారు. రామరాజుతో పాటు..వీరవాసరం, పాలకోడేరు, ఆకివీడు, కాళ్ల మండలాల్లోని తెదేపా నాయకులను బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. పోలీసుల చర్యలపై తెదేపా నాయకులు మండిపడ్డారు.
ఇవీ చదవండి: