TDP Ex MLA Aarimilli Radhakrishna Protest: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు పంటలు దెబ్బతిని.. చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 4,5,6వ తేదీల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించి.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ క్రమంలోనే రైతులను భరోసా ఇచ్చి.. పంటలను మూడు రోజుల్లో కొనాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. గడువులోగా పంటలు కొనని పక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అయితే పంటలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతు పోరు బాట పేరుతో నేడు పాదయాత్ర ప్రారంభించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఇరగవరం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సుమారు ఇది 12కిలోమీటర్ల మేర సాగనుంది. అయితే చంద్రబాబు నాయుడు రైతు పోరు బాటలో చంద్రబాబుకు తడిచిన ధాన్యాన్ని చూపించడానికి వచ్చిన రైతులను పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. దీనిని నిరసిస్తూ తణుకు మాజీ శాసన సభ్యులు, టీడీపీ నేత ఆరిమిల్లి రాధాకృష్ణ రోడ్డుపై బైఠాయించారు. వెంటనే స్పందించిన నర్సాపురం డీఎస్పీ మనోహర చారి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రాధాకృష్ణ నిరసన విరమించారు. పోలీసులు అనుచిత వైఖరిని ఆరిమిల్లి ఖండించారు. పాదయాత్రను సక్రమంగా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని, అందుకు తగిన బందోబస్తు నిర్వహించాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.. "చంద్రబాబు నాయుడు రైతు పోరు బాట చేస్తుంటే.. ఇక్కడి స్థానిక మంత్రికి వెన్నులో వణుకుపుడుతోంది. ఈ క్రమంలోనే పాదయాత్ర అడ్డుకునే విధంగా వారి మనుషులను పంపారు. తడిచిన ధాన్యాన్ని చంద్రబాబుకు రైతులు చూపించనీయకుండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు నాయుడి పాదయాత్ర జరుగుతుంటే వైసీపీ మంత్రుల మనుషులు పోలీసుల సహకారంతో ఆటంకాలు సృష్టించాలని చూస్తున్నారు. దీనిని సహించేది లేదు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారు. రైతులకు న్యాయం జరిగేందుకు చంద్రబాబు నాయుడు పోరాడుతుంటే.. వైసీపీ నాయకులు పోలీసుల సహకారంతో అడ్డుకోవడం వారి చేతకానీకతనానికి నిదర్శనం. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీసులు కూడా పాదయాత్రను సక్రమంగా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని, అందుకు తగిన బందోబస్తు నిర్వహించాలి" అని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: