పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను-2 బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరచూ ఏదో ఒక అద్భుతం సృష్టించి వార్తల్లో నిలుస్తున్నారు. సాధారణంగా స్కాట్లాండ్ బ్యాగ్ పైపు బ్యాండ్‌లో రాణించాలంటే కఠోర శ్రమ అవసరం. సుదీర్ఘకాలం పాటు దీనిలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. దేశంలో ఈ తరహా బ్యాండ్లు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. బాలయోగి గురుకుల పాఠశాలలో 25 సభ్యులతో కూడిన బ్యాండ్ ఉంది. పదిహేనేళ్ల లోపు పిల్లలతో ఏర్పడిన స్కాట్లాండ్ బ్యాగ్ పైపు బ్యాండ్ ప్రపంచంలో ఇది ఒకటే కావడం విశేషం. ఇటీవల అమరావతిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. వీరి ప్రతిభను మెచ్చిన గవర్నర్.. విద్యార్థులను అభినందించారు. అయిదు వేల నగదును సైతం ప్రోత్సాహకంగా అందజేశారు. ఆ విద్యార్థులు కనబరిచిన ఇతర విశేషాలు..చూద్దాం.
సాధించిన విజయాలు...
* 2019 జనవరి 26న అమరావతిలో నిర్వహించిన పరేడ్‌లో అద్భుత ప్రతిభ చాటారు. అప్పటి గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నారు.
* 2019 ఆగస్టు 15న అమరావతిలో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొన్నారు. సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా జ్ఞాపిక తోపాటుగా రూ.5వేల నగదును అందుకున్నారు.
* 2019 ఏప్రిల్‌లో ఐదు కిలోమీటర్ల కవాతును యాభై రెండు నిమిషాల్లో పూర్తిచేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సృష్టించారు.
* గతేడాది డిసెంబర్ 23న ప్రకాశం జిల్లా ఒంగోలులో సౌత్ జోన్ పోటీల్లో ప్రధమ స్థానం సాధించారు. పోటీలకు ఎంపిక కావడమే కాకుండా అక్కడ కూడా విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించారు.
* ఇటీవల విజయవాడలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు పాల్గొని ప్రథమ స్థానం సాధించారు. గవర్నర్ విశ్వభూషణ్ చేతులమీదుగా అవార్డును అందుకోవడంతో పాటు రూ.5వేల నగదును సొంతం చేసుకున్నారు.
* ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు చదువులోనూ రాణిస్తున్నారు. బాలయోగి గురుకుల పాఠశాల సాధిస్తున్న విజయాలకు గుర్తింపు లభిస్తోంది.