తెలుగు భాషను చంపే ప్రయత్నం ఇటీవల జరుగుతోందని, ఇది సబబు కాదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపాన పెదఅమిరంలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగును మించిన భాష ప్రపంచంలోనే లేదని ఆయన పేర్కొన్నారు. ‘తెలుగును ఏ తరమైనా చంపేద్దామనుకుంటే.. దాన్ని పరిరక్షించేందుకు మరో తరం ఉవ్వెత్తున పుట్టుకొస్తుంది.
పిల్లలను ఇంట్లో తెలుగులోనే మాట్లాడమనండి. హైదరాబాద్‌లో ఉన్న శిల్పారామానికి మించి తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే వేదికను ఏపీలోనూ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తా’ అని అన్నారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని సంబరాల్లో పాల్గొన్న మంత్రి శ్రీరంగనాథరాజు వివరించారు. అంతర్జాతీయంగా ఉన్న భాషాభిమానులను, సాహితీ సేవకులను ఓ చోటికి చేర్చిన నిర్వాహకులను అభినందిస్తున్నట్లు శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు.
విశిష్ట ప్రక్రియలకు ఆలవాలం: ఉపరాష్ట్రపతి
తెలుగు భాషకు మరింత వన్నె తెచ్చేలా అంతర్జాతీయ తెలుగు సంబరాలు దోహదపడతాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వేడుకల కోసం ఆయన సందేశం పంపారు. ‘అవధానంలాంటి ఎన్నో అద్భుత ప్రక్రియలున్న ఏకైక భాష మన తెలుగు. విశిష్ట ప్రక్రియలున్న తెలుగుభాషపై భావితరాలకు ఆసక్తి కలిగించాలి’ అని సూచించారు.
సంస్కృతికి ప్రతీకలా సంబరాలు
సంబరాలు నిర్వహిస్తున్న ప్రాంగణాన్ని తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారాలను, సభా ప్రాంగణాన్ని ప్రాచీన, ఆధునిక కవుల చిత్రాలతో అలంకరించారు. తేట తెలుగు గొప్పదనాన్ని, సంస్కృతిని వివరించేలా బుర్రకథలు, హరికథలు, ఏకపాత్రాభినయాలు, అవధానాలు, సాహితీ గోష్ఠులు ఏర్పాటుచేశారు.
మధ్యాహ్నం నుంచి అవధానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు నిర్వహించారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో గంట పాటు ఏకధాటిగా నిర్వహించిన ‘తెలుగు తోరణం’ నృత్యరూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 200 మంది విద్యార్థులు ప్రదర్శనలో భాగస్వాములయ్యారు. ప్రముఖ కవులు, కళాకారులు, తెలుగు గడ్డపై జన్మించి దేశం కోసం పోరాడి అసువులు బాసిన స్వాతంత్య్ర సమర యోధులను జ్ఞప్తికి తీసుకొచ్చేలా ప్రదర్శన సాగింది.
సభా వేదికపై ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల్లో పలువురు సాహితీ వేత్తలు, కవులు ప్రసంగించారు. కొందరు ఏమన్నారంటే..
నా వెంట నడవండి.. ‘తెలుగు నా భాష.. తెలుగు నా శ్వాస.. వెన్నెలే ఏమందో.. వెన్నలో ఏముందో నా భాషనడగండి. నా వెంట నడవండి. అలా వచ్చే వారంతా నా జాతి బంధువులే. అందుకే ఇక్కడికొచ్ఛా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని గజల్స్ శ్రీనివాస్ చేస్తున్నారు.’ - రసరాజు, ప్రముఖ కవి, సాహితీవేత్త
పద్యాన్ని జీవితాంతం వదలను.. ‘పద్యాలు నేర్చుకుంటే భాషపై పట్టు, ఏకాగ్రత పెరుగుతాయి. పద్యాన్ని జీవితాంతం వదలను. తెలుగు పద్యం ప్రశస్తి ప్రపంచవ్యాప్తమయ్యేందుకు కృషి చేస్తా’. - విష్ణుభట్ల కార్తీక్ (పద్య పఠనం)
ఇదీ చదవండి :