పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసింది. చదువుకునే విద్యార్ధిని, విద్యార్ధులకు నాణ్యమైన ఆహారం అందించాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. అలాంటి పథకంపై సంవత్సరం నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సకాలంలో పిల్లలకు ఆహారం అందకపోవడం, పోషకాలను ఇచ్చే గుడ్లు సరిగా ఉడక్కపోవడం, అన్నంలో పురుగులు రావడం వంటి సమస్యలతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని నెంబరు నాలుగు ప్రాథమిక పాఠశాలకు సరఫరా చేసిన అన్నంలో పురుగులు రావడంతో... విద్యార్థులు మధ్యాహ్న భోజనం మాకొద్దంటూ ఆందోళన చేశారు. ఏక్తా శక్తి ఫౌండేషన్ సరఫరా చేసిన మధ్యాహ్న భోజనాన్ని తాహసీల్దార్ శ్యాంప్రసాద్‌కు, ఎంఈఓ సత్యానంద్‌కు చూపించి తమ ఆవేదన తెలియజేశారు
ఏక్తా శక్తి సంస్థ సరఫరా చేస్తున్న భోజనంలో నాణ్యత లోపాలు... ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏడాది కాలంగా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో పురుగులున్న భోజనాన్ని తాహసీల్దార్ కార్యాలయానికి తీసికెళ్లి.. అక్కడ అధికారులకు చూపించిన అనంతరం కాలువలో పడేశారు.
ఇదే మండలానికి చెందిన మోగల్లులోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ జిల్లా విద్యాశాఖాధికారికి గతంలోనే ఫిర్యాదు చేశారు. అయినా సరే సరఫరాలో మార్పు కనిపించకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.
ఏక్తా శక్తి ఫౌండేషన్ మధ్యాహ్న భోజన విషయంలో... ఇప్పటికైన అధికారులు సత్వర చర్యలు తీసుకొని, పిల్లలకు పోషకాహరం అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి...