శ్రీకాకుళం జిల్లాలో...
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆమదాలవలసలో వర్తక వ్యాపార సంఘ నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఆమదాలవలస ఇందిరా గాంధీ విగ్రహం నుంచి కృష్ణాపురం వరకు ర్యాలీ చేపట్టారు. అధికంగా పెరుగుతున్న నిత్యవసర వస్తువులు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో స్థానికులు రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం జిల్లాలో...
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా... మద్దిలపాలెంలో వామపక్షాల నేతలు నిరసన చేపట్టారు. రాస్తారోకో నిర్వహించి, జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. టోల్గేట్ ధరలను తగ్గాంచాలని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో...
పెరిగిన ధరలకు నిరసనగా... ఏలూరులోని పెట్రోల్ బంకుల వద్ద నిరసనకారులు ఆందోళన చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యునికి అందనంత ఎత్తుకు చేరాయని ఆరోపించారు. ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుుపునిచ్చారు.
పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ... తణుకులో వామపక్షాలు, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో తో పాటు పట్టణంలోని పెట్రోల్ బంక్ ల ఎదుట ఆందోళన నిర్వహించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలో...
పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు నిరసనగా... ఒంగోలులో అఖిల పక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరాలలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, లారీ అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
అద్దంకిలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ... వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ లో నిరసన చేపట్టారు. నిత్యవసరాలు, పెట్రోల్ ధరల మోతతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు.
నెల్లూరు జిల్లాలో...
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటూ నెల్లూరులో సీపీఐ, సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. ర్యాలీ కారణంగా నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
కర్నూలు జిల్లాలో...
నగరంలో సీపీఎం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల వద్ద ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ధరలను నియంత్రించాలని కోరారు. పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని కోరుతూ... కర్నూలు జిల్లా లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలులోని కల్లూరు ఎస్టేట్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు.
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ... నంద్యాలలో వామపక్ష, కార్మిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆదోనిలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ధరలు తగించకపోతే, ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతపురం జిల్లాలో...
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ... అనంతపురంలో ఏఐటీయూసీ నాయకులు ఆందోళన చేశారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఆటో కు తాడు కట్టి లాగారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
హిందూపురంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ... సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో...
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించకంటే దేశ వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని ఏఐటీయూసీ, సీఐటీయూ కడప జిల్లా నాయకులు అన్నారు. ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ... కడప తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చిత్తూరు జిల్లాలో...
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా శ్రీకాళహస్తిలో సీపీఐ, సీపీఎం నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు.
ఇదీచదవండి.