పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ చక్రవార్యుత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి వేద మంత్రోచ్ఛారణల నడుమ దేవాలయ ప్రాంగణములో ఊరేగించారు. అనంతరం ఉత్సవ మూర్తులను యజ్ఞశాలలోని వేదికపై కొలువుదీర్చి పూజాధికాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లమూర్తుల వద్ద శ్రీ చక్ర పెరుమాళ్‌ను వేంచేపు చేశారు. ఈ సందర్భంగా మూర్తులకు సుగంధ ద్రవ్యాలు, పంచపల్లవులు, శ్రీ చందనం, పసుపు, అభిషేక తీర్థంతో శ్రీ చక్ర స్వామిని అభిషేకించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, నీరు, తేనె, కొబ్బరినీళ్లతో ఆలయ అర్చకులు శ్రీ చక్ర స్వామి అభిషేకం ఘనంగా జరిపించారు.
శ్రీ చక్ర పెరుమాళ్లతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి తిరుమంజనాలను జరిపి.. అలంకరించి, హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు.. భక్తుల శిరస్సులపై అభిషేక జలాన్ని చల్లారు. సాయంత్రం ఆలయంలో నిత్య హోమం, బలిహరణం, పూర్ణాహుతి వైభవంగా జరిపించారు. తర్వాత వేద మంత్రోచ్ఛారణలతో ధ్వజావరోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. కరోనా నిబంధనల మేరకు పరిమిత అర్చకులు, పండితులు, సిబ్బందితో పాటు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి పాల్గొని ఉత్సవాలను పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: Hanuman birth place: 'కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టాడు'.. 'కాదు..తిరుగిరుల్లోని అంజనాద్రిలోనే'