అప్పట్లో బ్రిటిష్ వారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్ కేంద్రంగా పాలన సాగించే వారు. సరైన రోడ్డు మార్గం లేకపోయినా అధికారుల భార్యలు నాటు పడవల్లో పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం చేరుకొని మత ప్రచారంతో పాటు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే వారు. ఈ క్రమంలో గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేశారు. దీంతో అక్షరాస్యత బాగా పెరిగింది. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఇక్కడి నుంచే అధిక సంఖ్యలో ప్రభుత్వ కొలువులకు ఎంపికయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. అనంతరం ఒకరిని చూసి మరొకరు అవే ఉద్యోగాలు సాధించారు. ఆగర్తిపాలెం జనాభా సుమారు 1800 వరకు ఉంటుంది. ప్రతి ఇంటిలో కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ప్రస్తుతం పదవీ విరమణ పొందిన వారితో కలిపి 200 మంది వరకు ఉంటారు.
అదృష్టంగా భావించా
గురుస్థానం ఎంతో గొప్పది. పదిమందిని ఉన్నతంగా తీర్చిదిద్దడం గురువుకు మాత్రమే దక్కే అదృష్టంగా భావించా. అందుకే మా అబ్బాయిని ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్ధా కోడలు కూడా అదే వృత్తిలో ఉన్నారు. మా మనవలు ముగ్గురు ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. ఉద్యోగ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
- దేవ కమలాబాయ్, విశ్రాంత ఉపాధ్యాయురాలు
మా ఇల్లంతా
నేను, నా భార్య ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేశాం. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా పిల్లలు కూడా అదే వృత్తి చేపట్టారు. కుమారుడు, కోడలు, మనవడు, మనవరాలు ఉపాధ్యాయులే. మునిమనవరాళ్లు కూడా అదే ఉద్యోగం సాధించేందుకు శిక్షణ పొందుతున్నారు. సమాజాన్ని తీర్చిదిద్దే వృత్తిని నాతో పాటు నా కుటుంబ సభ్యులు చేపట్టడం ఆనందంగా ఉంది.
- బొంతు జేమ్స్, విశ్రాంత ఉపాధ్యాయుడు
తాతే గురువు
మా తాత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాఠశాలలో అక్షరాలు నేర్చుకున్నా. మా నాన్న, మేనత్త, బాబాయి, పిన్ని కూడా ఉపాధ్యాయులు కావడంతో ఆ వృత్తిపై ఎనలేని మక్కువ పెరిగింది. టీటీసీ పూర్తిచేసి తొలి ప్రయత్నంలోనే 2012లో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించా. డిగ్రీ, బీఈడీ పూర్తిచేశా. ప్రస్తుతం చించినాడ ప్రధాన పాఠశాలలో పనిచేస్తున్నా. నా భార్య ప్రజ్వల కూడా ఉపాధ్యాయురాలే.
- బి.విజయబాబు, ఉపాధ్యాయుడు
ఇదీ చదవండి: