పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో వెలసిన రాట్నాలమ్మ అమ్మవారి.. భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధిచెందారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. తమ మొక్కుబడులు తీర్చుకొని.. ఇక్కడే భోజనాలు వండుకొని తిని వెళ్తుంటారు. కంఠం, సగం శరీరం, చేయి లేకుండానే అమ్మవారు దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. కొత్తగా ఆలయం నిర్మించాక.. మరో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి విగ్రహంపై ప్రత్యేక చరిత్ర వేంగి శాసనల్లో దర్శనమిస్తోంది.
స్థలపురాణం..
ఐదు శతాబ్దంలో ఈ ప్రాంతం వేంగి రాజ్యంలో ఉండేది. రత్నసంపదతో తులతూగే.. వేంగిరాజ్యంపై శత్రువులు, దొంగలు దాడులు చేసేవారు. రత్నసంపదను దొంగలించాలన్న వారి ప్రయత్నాలు రాట్నాలమ్మ అమ్మవారు అడ్డుకొనేవారు. వేంగి రాజ్యంలోకి వెళ్లకుండానే నియంత్రించేది. ఇది గమనించిన వేంగిరాజ్య శత్రురాజులు, దొంగలు.. అమ్మవారిపై దుష్టశక్తులు ప్రయోగించినట్లు ఈ ఆలయ స్థలపురణం చెబుతోంది. క్షుద్రపూజలు చేసి.. మాయఖడ్గాన్ని అమ్మవారిపై ప్రయోగించారు. చంద్రగ్రహణం రోజు ప్రయోగించడం వల్ల.. శక్తులు లేని అమ్మవారి శరీరం ముక్కలైంది. కంఠం, సగం శరీరం, చేయి వేరైంది. అమ్మవారు తన రక్తంలో అగ్నిని పుట్టించి.. శత్రువులను నాశనం చేశారు. ఈ అగ్నికిలలు రాజ్యం మొత్తం వ్యాపించడంతో అమ్మవారిని శాంతపరచడానికి వేంగిరాజ్యంలోని రత్నసంపదతో అభిషేక అర్చనలు చేశారు. అమ్మవారు శాంతించి.. ఖడ్గ ప్రయోగం చేసిన ప్రాంతంలోనే ఆలయం నిర్మించాలని రాజుకు తెలియజేశారు. అమ్మవారికోరిక మేరకు ఇక్కడ ఆలయం వెలసిందని స్థలపురాణం పేర్కొంటోంది.
ఇంటి ఇలవేల్పుగా..
రాట్నాలకుంటకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదవేగి.. ఒకప్పటి వేంగి రాజుల రాజ్యంగా శాసనాలు పేర్కొంటున్నాయి. వేంగిరాజులు తమ ఇలవేల్పుగా రాట్నాలమ్మను కొలిచేవారు. పరిసర గ్రామాల్లో ప్రజలు తమ ఇంటి దేవతగా అమ్మవారిని పూజిస్తారు. ఉభయగోదావరిజిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. శుక్ర, ఆదివారాల్లో అమ్మవారికి పొట్టేళ్లు, కోళ్లు బలిఇస్తారు. ఏ పనిచేయాలన్నా ముందుగా అమ్మవారిని దర్శించకోవడం ఈ జిల్లాల్లో ప్రజల ఆనవాయితీ.
రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరణ..
రైతులు ముందు అమ్మవారికి పూజలు చేసి.. పొలం పనుల్లో దిగేవారు. పాడిపశువులు ఈనినా.. మొదటి పాలు అమ్మవారికే సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. గతంలో చిన్న ఆలయంగా ఉండేది. ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలతో ఆలయాన్ని ఆధునీకరించారు. అమ్మవారి మూలవిరాట్టు వెనుక నూతనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాముండేశ్వరీ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. శివుణ్ని, విష్ణువును అధిదేవతలుగా చేసుకొని అమ్మవారు కొలువయ్యారు. ఈ ఆలయాన్ని దేవదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షిస్తోంది.
రాట్నాలమ్మ ఆలయాన్ని భక్తులే అభివృద్ధి చేస్తున్నారు. తమ కోరుకొన్న కోర్కెలు తీరడంతో ఆలయ అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తున్నారు.
ఇదీ చదవండీ..Farmers Problems: గిట్టుబాటు ధరలేక.. అమ్ముడుపోక..