పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామంలో 332 కుటుంబాలు ఉండగా.. 1275 మంది జీవిస్తున్నారు. గ్రామ సర్పంచి కలం ప్రసాద్ చొరవ చూపి సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తిరిగి కరోనాపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరూ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకురావొద్దని సూచించారు.
ఈ సమయంలో బంధువులను, కొత్తవారిని ఎవరినీ తమ ఇళ్లకు అనుమతించవద్దని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. ప్రతి ఇంటికి మాస్కులు పంపిణీ చేశారు. గ్రామస్థులు చైతన్యవంతులై నిబంధనలు తూ.చ పాటిస్తున్నారు. గ్రామానికి రావడానికి, గ్రామం నుంచి బయటకు వెళ్లడానికి రెండు దారులు ఉండగా.. రోజుకు ఇద్దరు వాలంటీర్లు, ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలకు విధులు కేటాయించారు. గ్రామం నుంచి అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారికి శానిటైజేషన్ చేసి పంపిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూస్తున్నారు. బయట వ్యక్తులను అనుమతించడం లేదు. అత్యవసరమైతే మాస్కులు ధరించిన వారిని చేతులకు శానిటైజేషన్ చేసి అనుమతిస్తున్నారు.
ఉపాధి హామీ పనులు చేసే ప్రదేశాల్లోనూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేస్తున్నారు. మంచినీటి ట్యాంకును నెలకొకసారి శుభ్రం చేయడంతో పాటు రెండుసార్లు క్లోరినేషన్ చేస్తున్నారు. ఇలా అన్ని విషయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఇప్పటివరకు కరోనా వైరస్ దరిచేరలేదని గ్రామస్థులు చెబుతున్నారు.
చైతన్యం తీసుకొచ్చాం..
ప్రజలు కరోనా బారినపడకుండా వారిలో చైతన్యం తీసుకొచ్చాం. ఇంటింటికి తిరిగి నిబంధనలు పాటిస్తే కరోనా దరిచేరదని సూచించాం. గ్రామంలో అత్యవసరమైనవి తప్ప మిగతా దుకాణాలు తెరవడం లేదు. అందుకే ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. - కలం ప్రసాద్, సర్పంచి, గుండేపల్లి పంచాయతీ
ఇదీ చదవండీ.. కృష్ణపట్నంలో కరోనా మందు.. పరిశీలిస్తున్న ఆయుష్ నిపుణులు